హైదరాబాద్‌లో కిరాణా షాప్‌లో గంజాయి చాక్లెట్లు..!!
Hyderabad: తెలంగాణలో.. ప్రత్యేకించి హైదరాబాద్‌లో గంజాయి, డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాల వినియోగం విచ్చలవిడిగా సాగుతోందంటూ కొద్దిరోజులుగా ఆందోళనలు వ్యక్తమౌతోన్నాయి. పోలీసులు ఇప్పటికే పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకోవడం, డ్రగ్స్ రాకెట్ల గుట్టు రట్టు చేయడం వంటి సంఘటనలు దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
గంజాయి అమ్మకాలపై ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితికి చెందిన కుత్బుల్లాపూర్ శాసన సభ్యుడు కేపీ వివేకానంద్ సైతం ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని అరికట్టడానికి తక్షణ చర్యలను తీసుకోవాలంటూ కొద్దిరోజుల కిందటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.

గతంలో ఎప్పుడూ లేనివిధంగా తెలంగాణ యువత గంజాయి మత్తులో మునిగితేలుతోందని, కుటుంబాలు, తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదని వివేకానంద వాపోయారు. చివరికి పాన్ షాపులు, కిరాణా దుకాణాల్లోనూ విక్రయించేంతటి స్థాయికి గంజాయి వ్యాపారం విస్తరించిందంటూ వివరించారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు.
ఈ పరిణామాల మధ్య- హైదరాబాద్ జగద్గిరిగుట్టలో పెద్ద ఎత్తున గంజాయి చాక్లెట్లు దొరకడం కలకలం రేపింది. ఓ కిరాణా షాప్‌లో ఈ గంజాయి చాక్లెట్లను పోలీసులు పట్టుకున్నారు. వాటిని సీజ్ చేశారు. సుమారు తొమ్మిదిన్నర కేజీల బరువు ఉండే చాక్లెట్ పాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కిరాణా షాప్‌ను నిర్వహిస్తోన్న ఓ మహిళను అరెస్ట్ చేశారు.
కిరాణా షాపుల్లో కూడా గంజాయి దొరుకుతోందంటూ రేవంత్ రెడ్డికి లేఖ రాసిన కేపీ వివేకానంద ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది ఈ జగద్గిరిగుట్ట. ఇంజినీరింగ్, ఫార్మా, మెడికల్, జూనియర్, డిగ్రీ కాలేజీలు ఈ ప్రాంతంలో అధికంగా ఉండటం.. ఆ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయిని విక్రయిస్తున్నారని పోలీసులు భావిస్తోన్నారు.
డ్రగ్స్‌పైనా హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో మరికొంతమందిని అరెస్ట్ చేశారు. దీని తీగలాగితే డొంక కదులుతుందనే అంచనాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications