నూతన సచివాలయానికి రేవంత్ రెడ్డి; పోలీసుల అడ్డగింత.. ఉద్రిక్తత!!
తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ తీరుపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్న విషయం తెలిసిందే. నూతన సచివాలయం నిన్న ప్రారంభం కావడంతో సచివాలయం విషయంలో కూడా ప్రతిపక్షాలు సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నాయి. ఇక ఇదే క్రమంలో తాజాగా టీపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి నూతన సచివాలయానికి వెళ్ళటానికి సిద్ధం కాగా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు.
అవుటర్ రింగ్ రోడ్డు కాంట్రాక్ట్ ను 30 ఏళ్ల పాటు కేవలం 7,380 కోట్లకు ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించడాన్ని తప్పుపట్టిన రేవంత్ రెడ్డి ఇందులో భారీ కుంభకోణం జరిగిందని ఇప్పటికే ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో అవుటర్ రింగ్ రోడ్డు టెండర్లపై సమాచారాన్ని అడగడానికి సచివాలయానికి వెళ్లాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.

ఈ క్రమంలోనే ఆయన ఈ రోజు నూతన సచివాలయానికి వెళ్లాలని బయలుదేరిన క్రమంలో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. టెలిఫోన్ భవన్ వద్ద రేవంత్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు సచివాలయానికి వెళ్ళటానికి వీలు లేదని చెప్పారు. దీంతో రేవంత్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సచివాలయానికి వెళ్ళే తనను ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. అవసరమైతే పోలీసులే తనను సచివాలయానికి తీసుకువెళ్లాలన్నారు.
ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ల అవకతవకలపై అధికారిని కలిసి ఫిర్యాదు చేయడానికి తాను వెళ్తున్నానని చెప్పారు. తాను సచివాలయానికి వెళితే పోలీసులకు వచ్చే నష్టం ఏమిటో అర్థం కావడం లేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఒక ఎంపీగా తాను సచివాలయానికి వెళ్లడానికి ఎటువంటి అనుమతి అవసరం లేదని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. తనను సచివాలయానికి అనుమతించే వరకు రోడ్డుపైన బైఠాయిస్తాన్నారు.
దీంతో పోలీసులకు రేవంత్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే మరో పక్క కాంగ్రెస్ శ్రేణులు సచివాలయం వద్దకు చేరుకునే అవకాశం ఉందన్న అనుమానంతో పోలీసులు సచివాలయం గేట్ల వద్ద భారీగా మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
సచివాలయం విజిటర్స్ గేట్లు మూసివేసిన పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైనా వస్తే వారిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో ప్రస్తుతం నూతన సచివాలయం వద్ద ఏం జరుగుతుందోనన్న ఆందోళన కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications