బట్టలిప్పించి బీఆర్ఎస్ నాయకులపై పోలీసుల థర్డ్ డిగ్రీ.. రేపు చలో ఆత్మకూరుకు పిలుపు!!
హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలోని అగ్రంపహాడ్ జాతరలో పోలీసులు బిఆర్ఎస్ నాయకులను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి అమానవీయంగా చిత్రహింసలకు గురి చేశారని, వారిపై థర్డ్ డిగ్రీని ప్రయోగించారని బీఆర్ఎస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. మేడారం జాతరకు సమాంతరంగా అగ్రంపహాడ్ లో సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించిన క్రమంలో దాదాపు 10 లక్షలకు పైగా భక్తులు పోటెత్తారు.
అగ్రంపహాడ్ జాతరలో సమ్మక్క ఆగమనం తర్వాత అమ్మవారిని దర్శించుకోవడానికి రేవూరి ప్రకాష్ రెడ్డి దంపతులు వచ్చారు. ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దంపతులు కూడా అగ్రంపహాడ్ జాతరకు వచ్చారు. రేవూరి ప్రకాష్ రెడ్డి దంపతులు దర్శనం చేసుకుంటున్న క్రమంలో, ధర్మారెడ్డి దంపతులను గేటు బయట పోలీసులు నిలిపివేశారు. దీంతో బిఆర్ఎస్ కార్యకర్తలు జై చల్లా ధర్మారెడ్డి అంటూ నినాదాలు చేస్తూ హంగామా చేయబోయారు.

ఇక నినాదాలు చేసిన వారిపై పోలీసులు దాష్టికంగా వ్యవహరించి, వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి ఇష్టం వచ్చినట్టు కొట్టారని, థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. మొత్తం 12 మందిని రాత్రికి రాత్రి టాస్క్ఫోర్స్ పోలీసులు పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి బట్టలు విప్పి అమానుషంగా కొట్టిన ఘటనపై రేపు ఛలో ఆత్మకూరు కు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ పార్టీ నేతలు.
ఈ ఘటన పైన స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పోలీసుల అరాచకాలు పెట్రేగిపోతున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన దాడి చేసిన ఆత్మకూరు ఎస్ఐ ని తక్షణం సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.
24 గంటల్లో పోలీసులు చర్యలు తీసుకోకపోతే చలో ఆత్మకూరుకు పిలుపునిస్తామని చెప్పిన క్రమంలో రేపు చలో ఆత్మకూరుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమవుతున్నారు. ఇక ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇందిరమ్మ రాజ్యం అంటే దాడులేనా అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా బి ఆర్ ఎస్ కార్యకర్తలపై 2600 కేసులను నమోదు చేశారని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే పరకాల బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులు స్పందించకపోతే మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయిస్తామని వారు తేల్చి చెబుతున్నారు.












Click it and Unblock the Notifications