రాజకీయ కుటుంబ కథాచిత్రం: ఒకరికి పదవి పాయే.. మరొకరికి పార్టీ పాయే!
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు, మాజీ మంత్రి కేటీఆర్ సోదరి అయిన కల్వకుంట్ల కవిత, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల.. ఈ ఇద్దరు చెల్లెళ్ల వల్ల వారి సోదరుల రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడింది. ఇద్దరి జీవితాల్లోనూ జరిగిన కుటుంబ కలహాలు వారి అన్నదమ్ముల రాజకీయ భవిష్యత్తును పూర్తిగా మార్చేశాయి.
తెలంగాణలో కవిత వివాదం
మాజీ బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత కుటుంబ కలహం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆమె తండ్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. దీంతో కవిత తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ వివాదం మొదలవడానికి కారణం కవిత తన కజిన్స్, సీనియర్ బీఆర్ఎస్ నాయకులైన టి. హరీష్ రావు, జె. సంతోష్ కుమార్లపై చేసిన ఆరోపణలు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ కుంభకోణం జరిగిందని, తన తండ్రి కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీయడానికి వీరు కుట్ర పన్నారని కవిత ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంలో కవిత తన సొంత సోదరుడు కూడా తన మాట వినలేదని చెప్పడం ద్వారా కుటుంబంలో నెలకొన్న కలహాలు స్పష్టంగా కనిపించాయి.

ఆంధ్రప్రదేశ్‌లో షర్మిల వివాదం: సీఎం పీఠం కోల్పోయిన జగన్
ఇలాంటి ఘటనే కొన్ని సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో కూడా జరిగింది. చెల్లెలి కారణంగా సోదరుడు ముఖ్యమంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల రెడ్డి, ఆస్తి గొడవల కారణంగా తన సోదరుడికి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారు. మొదట తెలంగాణలో తన సొంత పార్టీ (వైఎస్ఆర్టీపీ) స్థాపించినా అది పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత ఆమె తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి షర్మిల నాయకత్వం వల్ల పెద్దగా లాభం లేకపోయినప్పటికీ, ఆమె చేసిన ప్రచారాలు జగన్ ప్రతిష్టను బాగా దెబ్బతీశాయి. గత ఏడాది జరిగిన ఎన్నికల సమయంలో ఆమె తన సోదరుడు జగన్‌పై బహిరంగంగా విమర్శలు చేశారు. దీని ప్రభావం ఎన్నికల ఫలితాలపై స్పష్టంగా కనిపించింది. వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్‌లో ఘోర పరాజయం పాలైంది. జగన్‌కు వ్యతిరేకంగా పోటీ చేసిన టీడీపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమికి భారీ విజయం లభించింది.
జగన్ - షర్మిల వివాదం ఏమిటి?
షర్మిల, జగన్ మధ్య ఆస్తి పంపకాల విషయంలో వివాదం ఉంది. ఇద్దరి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం, జగన్‌కు 60 శాతం, షర్మిలకు 40శాతం వాటా రావాలి. అయితే, షర్మిల ఆరోపించిన దాని ప్రకారం, తన వాటాగా రావాల్సిన రూ.200 కోట్లను జగన్ తనకు ఇవ్వలేదని ఆరోపించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. సరస్వతీ పవర్ అండ్ ఇండస్ర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ షేర్ల బదిలీపై తన తల్లి వైఎస్ విజయలక్ష్మి, చెల్లి వైఎస్ షర్మిల మోసగించారని మాజీ సీఎం జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు.












Click it and Unblock the Notifications