ఆందోల్ లో అమీతుమీ తేల్చుకునే పనిలో క్రాంతి కిరణ్, దామోదర రాజనర్సింహ, బాబు మోహన్!!
తెలంగాణా ఎన్నికలకు అన్ని నియోజక వర్గాలలో ప్రచారం జోరుగా సాగుతోంది. కొన్ని నియోజకవర్గాలలో త్రిముఖ పోటీ ఉండగా, కొన్ని నియోజకవర్గాలలో ద్విముఖ పోటీ కొనసాగుతుంది. ఇక రాష్ట్ర రాజకీయాల్లో ఆందోల్ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి నుంచి గెలుపొందిన పలువురు శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రులయ్యారు. ఆందోల్ బరిలో ఎవరున్నారు? అక్కడ ప్రస్తుతం పోటీ ఎలా ఉంది? మనం తెలుసుకుందాం.
1967 నుంచి రిజర్వుడ్ స్థానంగా కొనసాగుతున్న ఆందోల్ లో దాదాపు రెండున్నర లక్షల మంది ఓటర్లున్నారు. ప్రధానపార్తీలు-BRS, కాంగ్రెస్,, BJP అభ్యర్ధులు సహా మొత్తం 18 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. అయితే ఆందోల్ విషయానికి వస్తే పుల్కల్ మండలంలో ఉన్న సింగూరు ప్రాజెక్టు నియోజక వర్గానికి ఆయువుపట్టు. 80 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తారు. ఇతర ఉపాధి అవాకాశాలు తక్కువ ఉండటంతో ఇతర ప్రాంతాలకు వలసలు సాధారణం.

ఆందోల్ SC రిజర్వుడ్ స్థానం నుంచి మూడు సార్లు గెలిచిన మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రత్యెక రాష్ట్రం ఏర్పడ్డాక రెండుసార్లు ఓటమిపాలయ్యారు. స్వరాష్ట్రంలో జరిగిన మొదటి ఎన్నికలో BRS నుంచి సినీనటుడు బాబు మోహన్, గత ఎన్నికలో జర్నలిస్ట్ క్రాంతి కిరణ్ విజయం సాధించగా మళ్ళీ ఈ ముగ్గురూ మరోసారి ఎన్నికల బరిలో పోటీ పడుతున్నారు.
సిట్టింగు BRS సభ్యులు క్రాంతి కిరణ్ ప్రభుత్వ పధకాలను విస్తృతంగా ప్రచారం చేస్తూ మరో అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఈ సారి ఎలాగైనా గెలుపు సాధించాలని పట్టుదలగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్ధి దామోదర రాజనర్సింహ విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు.
ఈ సారి BJP నుంచి పోటీ పడుతున్న బాబూ మోహన్ సర్వశక్తులు ఒడ్డి గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. మూడు ప్రధాన పక్షాలు ఈ సారి ఆందోల్ పోటీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ రాజకీయాలు కాక రేపుతున్నాయి. ఇక్కడ త్రిముఖ పోరు కొనసాగుతున్న నేపథ్యంలో ఓటర్లు ఎవరిని ఆదరిస్తారో తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications