రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మలుపు: హరీశ్ ఇంటికి కల్వకుంట్ల కవిత
మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావును తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఇటీవల హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ రావు వయోభారంతో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు, పార్టీల కీలక నేతలు, అభిమానులు హరీశ్ రావు ఇంటికి వెళ్లి పరామర్శిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే కల్వకుంట్ల కవిత తన భర్త అనిల్‌తో కలిసి కోకాపేట్‌లోని హరీశ్ రావు నివాసానికి వెళ్లారు. ముందుగా హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం హరీశ్ రావుతో మాట్లాడి ఆయన కుటుంబ సభ్యులతో పాటు మేనత్త లక్ష్మిని ఓదార్చారు. అనంతరం ఆమె నేరుగా బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయానికి వెళ్లిపోయారు. తాజాగా ఆమె మహబూబ్‌నగర్ పర్యటనలో జాగృతి జనం బాట కార్యక్రమంలో ఉన్నారు.

ఇదిలా ఉండగా.. ఇటీవల కల్వకుంట్ల కవిత హరీశ్ రావుపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆమె చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలిచాయి. కాళేశ్వరం అవినీతిలో తన తండ్రి కేసీఆర్ పాత్ర లేదని.. అంతా హరీశ్ రావే ముందుండి నడిపించాడని సంచలన ఆరోపణలు చేశారు. హరీశ్ రావు కోవర్టు అంటూ వ్యాఖ్యానించి ఫైర్ అయ్యారు. కోవర్టుల కారణంగానే బీఆర్ఎస్ నాశనమైందని ఆయనను ఉద్దేశించి సంచలనం సృష్టించారు. పార్టీలో గ్రూపు రాజకీయాలకు హరీశ్ రావు, సంతోష్ రావులు కేరాఫ్ అంటూ కవిత మాట్లాడడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలిచింది.
అయితే తాజాగా హరీశ్ రావు తండ్రి కన్నుమూసిన తరుణంలో వారి ఇంటికి వెళ్లి పరామర్శించడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. నిన్న మొన్నటి వరకు ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉందని అందరూ భావించారు. వారిద్దరు ఇక బద్ధ శత్రువులు అని.. ఇక మాటలుండవని చాలా మంది అనుకున్నారు. తాజా పరిణామంతో రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని మరోసారి రుజువైందని రాజకీయా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు హరీశ్ రావు, కవిత మధ్య గొడవ సద్దుమణిగిందా అంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి.












Click it and Unblock the Notifications