నల్గొండ నియోజకవర్గంలో నువ్వా నేనా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి vs కంచర్ల భూపాల్ రెడ్డి!!
సామాజిక, రాజకీయ కారణాలతో నల్గొండ శాసనసభ నియోజక వర్గం అందరికీ ఆసక్తి కల్గిస్తోంది. రాష్ట్ర రాజకీయాల ఒరవడిని ప్రతిబింబించే, నల్గొండ నియోజక వర్గంలో ఎన్నికల రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. శాసనసభకు ఎన్నికవటానికి మాజీ ముఖ్యమంత్రి NT రామారావు ఒకప్పుడు నల్గొండ నియోజక వర్గాన్నే ఎంచుకున్నారు. నల్గొండ స్థానం - నిత్య రాజకీయ, సామాజిక చైతన్య ప్రతీక.
14 సార్లు ఎన్నికలు జరిగినా, వరుసగా నాలుగు సార్లు గెలిచిన నాయకుడు కోమటి రెడ్డి వెంకట రెడ్డి మాత్రమే కావటం విశేషం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత శాసనసభ ఎన్నికల్లో ఓటమిపాలయి, భువన గిరి నుంచి లోక్ సభ కు ఎన్నికయ్యారు. నల్గొండ ను దత్తత తీసుకుంటానని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు హామీ ఇవ్వటం గత ఎన్నికలో బీఆర్ ఎస్ అభ్యర్ధి కంచర్ల భూపాల్ రెడ్డి విజయానికి దోహద పడింది.

ప్రస్తుతం మళ్ళీ బరిలో నిలిచిన సిట్టింగు BRS అభ్యర్ధి భూపాల్ రెడ్డి పై కాంగ్రెస్ MP కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేస్తూ ఉండగా, BJP నుంచీ మాదగాని శ్రీనివాస్ గౌడ్ గట్టి పోటీ ఇస్తున్నారు. బహుముఖ పోటీ నెలకొన్న నల్గొండ స్థానంలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పిల్లి రామరాజుయాదవ్, మరో 30 మంది పైగా పోటీలో ఉన్నారు.
నియోజక వర్గాన్ని తానెంతో అభివృద్ధి చేశాననీ, మరో అవకాశం ఇస్తే మిగిలిన పనులూ పూర్తి చేస్తానని, కాంగ్రెస్ హామీలను నమ్మొద్దని BRS అభ్యర్ధి కంచర్ల భూపాల్ రెడ్డి కోరుతున్నారు. BC ముఖ్యమంత్రి అన్న BJP ప్రతిపాదనతో ఆ పార్టీ అభ్యర్ధి శ్రీనివాస్ గౌడ్ వెనుకబడిన వర్గాల ప్రాతినిధ్యంపై ప్రచారం సాగిస్తున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన హయాంలో జరిగిన యూనివర్సిటీ ఏర్పాటు , పోలీస్ బెటాలియన్ ఏర్పాటు, SLBC సొరంగం నిర్మాణం లాంటి పనులతో పాటూ, పార్టీ 6 గ్యారంటీలను ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ అవినీతిని, కుటుంబ పాలనను టార్గెట్ చేస్తున్నారు. హోరాహోరీగా ప్రచారం చేస్తూ ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఓటర్లు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications