పొంగులేటి సర్వేలో తేలిందిదే - తాజా టార్గెట్, ముహూర్తం ఫిక్స్..!!
మాజీ ఎంపీ పొంగులేటి రాజకీయంగా వేగంగా అడుగులు వేస్తున్నారు. బీఆర్ఎస్ లక్ష్యంగా పొంగులేటి వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. రెడ్డి సామాజికవర్గ నేతల పునరేకీకరణ ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. పలు జిల్లాలోని ముఖ్య నేతలు పొంగులేటితో సమావేశాలు కొనసాగిస్తున్నారు.
రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి పొంగులేటి ప్రకటన చేసేందుకు ముహూర్తం నిర్ణయించారు. రాజకీయ కార్యాచరణను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజైన జూన్ 2 నుంచి అమలు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

పొంగులేటి సర్వే లెక్కలు: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి రాజకీయ అడుగులు ఆసక్తి కరంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి దూరం కావాలని నిర్ణయించిన పొంగులేటితో కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతలు సమావేశాలు నిర్వహించారు. తమ పార్టీల్లోకి రావాలని ఆహ్వానించారు. ఆ రెండు పార్టీలకు తన చేరిక పైన పొంగులేటి ఎటువంటి హామీ ఇవ్వలేదు. ఇదే సమయంలో పొంగులేటి కొత్త పార్టీ అంశం తెర మీదకు వచ్చింది.
తాను ఏ పార్టీలో చేరితే మంచిదనే అంశం పైన రెండు జాతీయ పార్టీల బలా బలాపైన సర్వే చేయించారు. అందులో కాంగ్రెస్ కు 46శాతం, బీజేపీకి 18శాతం అనుకూలంగా ఉన్నట్లు తేలిందని సమాచారం. దీంతో, ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు దిశగా పొంగులేటి అడుగులు వేస్తున్నారు.
కొత్త వేదిక కార్యాచరణ: పలు నియోజకవర్గాల నేతలు పొంగులేటి, జూపల్లి కృష్ణారావుతో ఇటు ఖమ్మం అటు హైదరాబాద్‌లోని రాఘవ టవర్స్‌లో రహస్యంగా సమావేశమయ్యారు. తన నిర్ణయం ప్రకటించే వరకు ప్రజల్లో కొనసాగాలని, ఏదో ఒక ఆందోళన చేపడుతూ ఉండాలని నిర్ణయించుకున్న పొంగులేటి శనివారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట రైతు భరోసా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత పాలేరు నుంచి భద్రాచలం వరకు పాదయాత్ర చేసేఆలోచనలో ఉన్నారు.
ఈ నెల 22న సోమవారం తదియ మృగశిర కార్తె మంచి ముహూర్తంగా ఉండటంతో రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి పొంగులేటి ప్రకటన చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. మొదట ఖమ్మంలో, అనంతరం మహబూబ్‌నగర్, నల్లగొండలో బహిరంగ సభలు నిర్వహించే యోచనలో ఉన్నారు.
వరుస సమావేశాలు: రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ లో అసంతృప్తులుగా ఉన్న నేతలు పొంగులేటితో టచ్‌లోకి వెళ్లారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు కాంగ్రెస్ కీలక నేతలు పొంగులేటితో భేటీ కావడానికి షెడ్యూల్ ఖరారైనట్లు తెలిసింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డితో నల్లగొండ జిల్లా బీఆర్‌ఎస్ మాజీ నాయకుడు చకిలం అనిల్ కుమార్ శనివారం ఖమ్మంలో భేటీ అయ్యారు. సుమారు 2 గంటల పాటు వారి మధ్య చర్చలు జరిగాయి.
అనంతరం భవిష్యత్తులో పొంగులేటితో కలిసి ప్రయాణిస్తానని అనిల్ వెల్లడించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు కాంగ్రెస్ కీలక నేతలు పొంగులేటితో భేటీ కావడానికి షెడ్యూల్ ఖరారైనట్లు తెలిసింది. ఎన్నికలను ఎదుర్కొనే క్రమంలో కేంద్రంలోని బీజేపీ సహకారం.. బీఆర్‌ఎస్ అసమ్మతి నేతలు, ఉద్యమకారుల సహకారం తీసుకోవాలని వ్యూహాలు సిద్దం చేస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications