కాంగ్రెస్‌లో ముసలం: పట్టించుకోవట్లేదని సోనియాకు పొంగులేటి రాజీనామా లేఖ
హైదరాబాద్: ఇప్పటికే అధికార టిఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌కు కకలావికలం అవుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టింది. పార్టీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి పార్టీలోని అన్ని పదవులకు బుధవారం నాడు రాజీనామా చేశారు.
పీసీసీ పదవుల కేటాయింపులో పార్టీ రాష్ట్ర నాయకత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి పంపించారు. పార్టీలో సీనియర్లను పక్కనపెడుతున్నారని ఆయన ఆరోపించారు.

రాష్ట్ర నాయకత్వం తమకు అనుకూలంగా ఉన్నవారి మాటకే ప్రాధాన్యమిస్తూ జూనియర్లను అందలం ఎక్కించిందన్నారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం తీరుకు నిరసనగా పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. పిసిసిలో పదవుల పంపిణీ సక్రమంగా జరగలేదన్నారు.
పనిచేసే వారికి పదవులు ఇవ్వరా అని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, సీనియర్ నేత షబ్బీర్ అలీలు రంగంలోకి దిగారు. సీనియర్లను పక్కన పెట్టమని, అందరికీ అవకాశమిస్తామని వారు బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications