హైదరాబాద్ లో త్వరలో 24 గంటలూ బస్ సర్వీసులు: మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ మహానగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. 2010 నాటి జనాభా లెక్కలు, ఓటర్ల సంఖ్యను ఆధారంగా హైదరాబాద్ పరిధిలో 1.34 కోట్ల మంది ఉంటారని అంచనా.. ఇతర రాష్ట్రాల నుంచి భాగ్య నగరానికి ఉపాధి, ఉద్యోగాల కోసం నిత్యం వేలాదిమంది వస్తుంటారు. అందువల్ల హైదరాబాద్ మహా నగరం జనాభా గణనీయంగా పెరుగుతోంది. సిటీలో సాఫ్ట్ వేర్, ఫార్మసీ రంగాలతో పాటు ఇతర రంగాల్లో ఉద్యోగాలు, ఉపాధి నిమిత్తం పొద్దున నుంచి అర్ధరాత్రి వరకూ నగర వాసులు ప్రయాణం చేస్తూనే ఉంటారు. అయితే వారి ప్రయాణానికి అనుకూలంగా బస్సు సర్వీసులు అందుబాటులో లేవని ఆందోళన వ్యక్తం అవుతున్న తరుణంలో ఇటీవల సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వం రాత్రి పూట కూడా బస్సు సర్వీసులను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ ప్రత్యేక బస్ సర్వీసులకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా వెల్లడించారు. రానున్న రోజుల్లో మరిన్ని కొత్త రూట్లలో రాత్రిపూట బస్సు సర్వీసులు ప్రారంభించాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రధాన మార్గాల్లో థర్డ్ షిఫ్ట్ సర్వీసులను విస్తరిస్తామని ఈ మేరకు మంత్రి వెల్లడించారు. రాత్రిపూట అందుబాటులో ఉన్న సర్వీసుల వివరాలు చూస్తే..
రూట్ నెం. 222A కోఠి - పటాన్ చెరు
అబిడ్స్, లక్డికాపూల్, కేర్ హాస్పిటల్, అన్నపూర్ణ, ఉషాకిరణ్, గుట్లబేగంపేట్, కొండాపూర్ క్రాస్ రోడ్, హఫీజ్‌పేట్, లింగంపల్లి, రామచంద్రాపురం, బీరంగుడి మీదుగా పటాన్‌చెరు వరకు సర్వీసులు. 4 బస్సులు - 16 ట్రిప్పులు - 45 నిమిషాల ఫ్రీక్వెన్సీ
రూట్ నెం. 218 అఫ్జల్ గంజ్ - పటాన్ చెరు
CBS, కోఠి, లక్డికాపూల్, ఎస్. ఆర్. నగర్, వై జంక్షన్, KPHB, మియాపూర్, లింగంపల్లి, రామచంద్రాపురం మీదుగా సర్వీసులు. 2 బస్సులు - 8 ట్రిప్పులు - 75 నిమిషాల ఫ్రీక్వెన్సీ
రూట్ నెం. 219 - సికింద్రాబాద్ - పటాన్ చెరు
ప్యారడైజ్, తాడ్ బండ్, బోయిన్ పల్లి, బాలానగర్ క్రాస్ రోడ్, IDPL, ప్రశాంత్ నగర్, కూకట్ పల్లి, KPHB, హైదర్ నగర్, గంగారం, లింగంపల్లి, రామచంద్రాపురం మీదుగా పటాన్ చెరు వరకు సర్వీసులు. 2 బస్సులు - 8 ట్రిప్పులు - 75 నిమిషాల ఫ్రీక్వెన్సీ
రూట్ నెం. 290U - హయత్‌నగర్ - సికింద్రాబాద్
భాగ్యలత, పనామా, ఎల్.బి. నగర్, అల్కాపురి, నాగోల్, నాగోల్ మెట్రో స్టేషన్, సర్వే ఆఫ్ ఇండియా, NGRI, తార్నాక, అలుగడ్డబావి, చిలకలగూడ, రాతిఫైల్, సికింద్రాబాద్ ఆల్ఫా, JBS మీదుగా సర్వీసులు. 3 బస్సులు - 14 ట్రిప్పులు - 75 నిమిషాల ఫ్రీక్వెన్సీ
రూట్ నెం. 195W - బాచుపల్లి - వేవ్ రాక్
నిజాంపేట్, నిజాంపేట్ క్రాస్ రోడ్, JNTU, హైటెక్ సిటీ, ESIC, ఇందిరానగర్, ఇన్ఫోసిస్, ఇన్ఫోటెక్ మీదుగా వేవ్‌రాక్ వరకు సర్వీసులు. 3 బస్సులు - 18 ట్రిప్పులు - 40 నిమిషాల ఫ్రీక్వెన్సీ
రూట్ నెం. 10H - కొండాపూర్ - సికింద్రాబాద్
ప్లాజా, పోలీస్ లైన్స్, ఆర్.జె. కాలేజ్, స్టేట్ హోమ్, ఉషాకిరణ్, సైబర్ టవర్స్ మీదుగా సికింద్రాబాద్ వరకు సర్వీసులు. 2 బస్సులు - 6 ట్రిప్పులు - 50 నిమిషాల ఫ్రీక్వెన్సీ

మరోవైపు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభించిన ఈ రాత్రిపూట సర్వీసుల్లో కేవలం ఏడు రోజుల్లోనే 9,286 మంది ప్రయాణికులు ప్రయాణించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అర్ధరాత్రి వేళల్లో కూడా ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రజా రవాణా అందుబాటులోకి రావడంతో హైదరాబాద్ మహానగర ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని రూట్లలో థర్డ్ షిఫ్ట్ సేవలు ప్రారంభిస్తామని తెలిపారు. ప్రజా రవాణాను మరింత బలోపేతం చేసి, హైదరాబాద్ నగరంలో 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండే రవాణా వ్యవస్థను దశలవారీగా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications
