స్వర్ణగ్రామం, స్వర్ణవార్డు ఉద్యోగుల ఛలో విజయవాడ..! పోలీసుల బ్రేక్ ?
ఏపీలో తమ దీర్ధకాలిక సమస్యల పరిష్కారం కోసం స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఉద్యోగులు రేపు రోడ్డెక్కబోతున్నారు. తమ సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అదే సమయంలో ఇతర శాఖలకు చెందిన పనుల్ని కూడా తమపై రుద్దుతూ ఒత్తిడి పెంచేస్తోందని, దీని వల్ల ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఛలో విజయవాడకు (Chalo Vijayawada) స్వర్ణగ్రామం, స్వర్ణవార్డు ఉద్యోగులు సిద్ధమయ్యారు. ప్రభుత్వంతో తాజాగా జరిపిన చర్చలు కూడా విఫలం కావడంతో ఈ మేరకు ఛలో విజయవాడకు వారు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
విజయవాడలోని గాంధీ నగర్ లో ఉన్న ధర్నా చౌక్ లో భారీ ఎత్తున ధర్నా నిర్వహించాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్వర్ణగ్రామం, స్వర్ణవార్డు ఉద్యోగులకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో వారు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి విజయవాడకు తరలివచ్చేందుకు సిద్దమవుతున్నారు. దీంతో విజయవాడ నగరంలో ఈ ఆదివారం భారీ ఆంక్షలు అమలు చేసి, ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు కూడా సిద్దమవుతున్నారు. ధర్నా లేదా ఆందోళన కార్యక్రమాల్లో సంఘవిద్రోహ శక్తులు చొరబడి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్నందున, పోలీసు నిబంధనలను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

అలాగే జిల్లాల్లో సైతం పోలీసులు స్వర్ణగ్రామం, స్వర్ణవార్డు ఉద్యోగుల ఛలో విజయవాడ కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు లేవని, ఉద్యోగులు వెళ్లేందుకు ప్రయత్నిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. రేపు తలపెట్టిన స్వర్ణగ్రామ-స్వర్ణవార్డు ఉద్యోగుల చలో విజయవాడ కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు లేవని ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతులు లేనందున స్వర్ణగ్రామ-స్వర్ణవార్డు ఉద్యోగులు విజయవాడకు వెళ్లే కార్యక్రమాన్ని విరమించుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని, పోలీసులకు సహకరిస్తూ సంయమనంతో వ్యవహరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.














Click it and Unblock the Notifications
