పవర్ కమీషన్ అందుకే.. కేసీఆర్ ను అరెస్ట్ చెయ్యాలని వాళ్లకు తొందర!!
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పైన బురద చల్లేందుకు విచారణ కమిషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జి. జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం గత ప్రభుత్వంపై నిందలు వేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో ఇది భాగమని ఆయన అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై జగదీశ్ రెడ్డి ఆగ్రహం
తెలంగాణ భవన్ లో జగదీశ్ రెడ్డి నేడు మీడియా సమావేశం నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ఒప్పందాలలో నాలుగు అంశాల్లో ఎక్కడా కూడా చిన్న తప్పు జరగలేదన్నారు. ఒక్క రూపాయి కూడా నష్టం జరగలేదని ప్రజలకు అర్థమైందని పేర్కొన్నారు జగదీశ్ రెడ్డి.

నిబంధనలకు విరుద్ధంగా కమీషన్ ప్రెస్ మీట్
నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ తో మీడియా సమావేశం పెట్టించి గతంలో కాంగ్రెస్ పార్టీ, బిజెపి పార్టీ నేతలు మాట్లాడిన మాటలను చెప్పించారని ఆయన ఆరోపించారు. వివక్ష, ముందస్తు అభిప్రాయాలు లేకుండా ఏ విచారణ అధికారి అయిన విచారణ జరపాలని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ ఒప్పందాలకు సంబంధించిన విచారణ కమిషన్ పైన స్పందించిన ఆయన విచారణ అధికారికి ఎటువంటి ఉద్దేశాలు ఉండకూడదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
విచారణ పూర్తికాక ముందే ఎలా మాట్లాడతారు
కానీ విద్యుత్ ఒప్పందాలపై విచారణ కమిషన్ విచారణ పూర్తి చేయకముందే పలు విషయాలను వెల్లడించిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సమస్యను పరిష్కరించడం కోసమే నాడు ఒప్పందాలు చేసుకున్నామని, తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకారమవుతుందని నాటి సమైక్యవాదులు భయపెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ హయాంలో అన్ని అనుమానాలను నివృత్తి చేస్తూ 24 గంటలు కరెంటు ఇచ్చామని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒకటే
కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలివితక్కువతనం, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారని జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ను అరెస్టు చేయాలని బిజెపికి తొందరగా ఉన్నట్టుందని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ బిజెపి రెండు ఒకటేనని సీఎం రేవంత్ రెడ్డి బండి సంజయ్ కలిసి పని చేస్తున్నారని తాము ఐదేళ్లుగా ఇదే విషయాన్ని చెబుతున్నామని జగదీశ్ రెడ్డి గుర్తు చేశారు. కావాలని కేసీఆర్ పైన, గత ప్రభుత్వం పైన చెడు ఉద్దేశంతోనే విద్యుత్తు కొనుగోళ్ల విషయంలో రచ్చ చేస్తున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications