KCR: కేసీఆర్ ను టెన్షన్ పెడుతున్న హైకోర్టు తీర్పు.. ఏమిస్తుందో?
ఛత్తీస్ గడ్ నుండి విద్యుత్తు కొనుగోళ్ల విచారణపై జస్టిస్ నరసింహారెడ్డి కమీషన్ ను రద్దు చేయాలని కెసిఆర్ హైకోర్టులో వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది. ఇప్పటికే కేసీఆర్ తరపు అడ్వకేట్ వాదనలు వినిపించగా నేడు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు.
విద్యుత్ కొనుగోళ్ళ విచారణపై కేసీఆర్ పిటీషన్ పై వాదనలు
విద్యుత్తు కొనుగోళ్లపై ఎంక్వయిరీ చేయించుకోమని నేరుగా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారని, ఎంక్వయిరీ చేయమని వారు అడిగినప్పుడు కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని, అలాంటప్పుడు ఈ కమీషన్ ఏకపక్ష కమీషన్ ఎలా అవుతుందో చెప్పాలని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ప్రశ్నించారు. జస్టిస్ నరసింహారెడ్డి పెట్టిన ప్రెస్ మీట్ లో ఎక్కడా కంక్లూజన్ వచ్చినట్టు మాట్లాడలేదని, అంతేకాదు ప్రెస్ మీట్ వీడియోలో కూడా ఎక్కడ ఏకపక్షంగా మాట్లాడలేదన్నారు.

విద్యుత్ కొనుగోళ్ళ విచారణ ఓపెన్ గానే
నిబంధనల ప్రకారమే రెండుసార్లు నోటీసులు ఇచ్చామని, విద్యుత్తు కొనుగోలు వ్యవహారంపై పబ్లిక్ నోటీసు సైతం జారీ చేశామని, ఈ వ్యవహారంలో విచారణ మొత్తం ఓపెన్ గానే జరుగుతుందని, ఇప్పటివరకు 15 మంది నుండి వివరాలు సేకరించామని కోర్టుకు తెలిపారు. ఈ 15 మందిలో మాజీ సీఎండి ప్రభాకర్ రావు తో పాటు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కూడా ఉన్నారన్నారు.
నిబంధనల ప్రకారమే విచారణ
నిబంధనల ప్రకారమే నోటీసులు జారీ చేసి విచారణ జరుపుతున్నామని వారు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ కు కూడా నోటీసులు ఇచ్చి ఎవిడెన్స్ ఇవ్వాలని మాత్రమే కోరామని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.
అంతకుముందు జూన్ 27వ తేదీన కెసిఆర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ ఆదిత్య సోంధి వాదనలు వినిపించారు.
తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు
జూన్ 30వ ఎంక్వైరీ కమీషన్ గడువు ముగుస్తుందని, ఈలోగా కమీషన్ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని కాబట్టి కమీషన్ విచారణ పై స్టే ఇవ్వాలని కెసిఆర్ తరపు న్యాయవాది కోరారు. దీంతో నేడు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది. ఈరోజు కానీ లేదా జులై 1వ తేదీన కానీ తీర్పును వెల్లడిస్తామని పేర్కొంది.












Click it and Unblock the Notifications