సీఎంగా రేవంత్ రెడ్డి పాలనలో ప్రజావాణి కార్యక్రమం కొత్తగా.. అసలు మ్యాటరేమిటంటే!!
తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా నేడు సోమవారం కావటంతో ప్రజా వాణి వినతుల స్వీకరణ కార్యక్రమం నిర్వహణ జరుగుతుంది. అయితే సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజా వాణి కార్యక్రమంలో కొత్త ఒరవడి చోటు చేసుకోబోతుంది అన్నది పెద్ద ఎత్తున ప్రచారం అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజావాణి వినూత్నంగా ప్రజల సమస్యలను పరిష్కరించనుంది.
తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో కూడా ప్రజావాణి వినతుల స్వీకరణ కార్యక్రమం కొనసాగింది. ప్రతి జిల్లాలోనూ జిల్లాల వారీగా కలెక్టర్లు ప్రజావాణి వినతుల కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు తీసుకుని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన సమస్యలను పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారు అన్న చర్చ జరుగుతుంది.

ఇక ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజావాణి పై దృష్టి సారించింది. తెలంగాణ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తొలి నాడే రేవంత్ రెడ్డి ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా నేరుగా ప్రజల సమస్యలను తెలుసుకొని, వారి సమస్యల పరిష్కారానికి అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. ఒకపక్క ప్రజా దర్బార్ నిర్వహిస్తూనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రణాళిక బద్ధంగా నిర్వహించడానికి రంగం సిద్ధం చేశారు.
ఈ క్రమంలో జిల్లాల వారీగా పరిష్కరించాల్సిన సమస్యలను అధికార యంత్రాంగం తప్పక పరిష్కరించాలని, రాష్ట్ర స్థాయిలో పరిష్కరించాల్సిన సమస్యలను రాష్ట్ర స్థాయి అధికారులకు పంపాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో ఇంతకాలం మొక్కుబడిగా ప్రజా వాణి నిర్వహించారన్న దానికి స్వస్తి పలికి ప్రజా సమస్యలను పరిష్కరించాలన్నారు.
ఉన్నత స్థాయి అధికారుల నుండి వచ్చిన ఆదేశాల మేరకు జిల్లా స్థాయి అధికారులు సీరియస్ గా ఈ కార్యక్రమంపై దృష్టి సారిస్తున్నారు. జిల్లాలలో సమస్యలు పరిష్కారం కాలేదని ఎవరూ ప్రజా దర్బార్ కు రాకూడదని రేవంత్ ఆదేశాల నేపధ్యంలో అధికారులు జిల్లాల వారీగా సమస్యలపై ఫోకస్ పెట్టనున్నారు. మరి ఈ ప్రయత్నం ఏ మేరకు ప్రజల సమస్యలను పరిష్కరిస్తుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications