కేసీఆర్ మహా డైలమా: సీఎంని ఒప్పిస్తారా, తగ్గిస్తారా?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు పైన కసరత్తు చేస్తోంది. దీని ఎత్తు తగ్గిస్తే తెలంగాణ పైన ప్రభావం ఎలా పడుతుందని నీటి పారుదల శాఖ నివేదిక రూపొందించనుంది. మార్పు చేయాలా లేక మహారాష్ట్రను ఒప్పించాలా అనే దాని పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఓ నిర్ణయం తీసుకోనుంది.
రెండు రోజుల క్రితం తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ప్రాణహిత-చేవెళ్ల ముంపు ప్రాంతాన్ని తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని ఫడ్నవీస్ కోరగా.. కేసీఆర్ పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. తగ్గింపు హామీపై కాంగ్రెస్ ఇప్పటికే నిప్పులు చెరిగింది.

160 టీఎంసీల నీటిని మళ్లించేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టు కోసం అదిలాబాద్ జిల్లాలోని తుమ్మడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం తలపెట్టారు. ఈ బ్యారేజీ పూర్తిస్థాయి నీటిమట్టం 152 మీటర్లు. ఈ స్థాయి నీటి మట్టం ఉంటేనే 5.11 టీఎంసీల నీటి నిల్వకు అవకాశముంటుంది. బ్యారేజీ వల్ల ఆరువేలకు పైగా ఎకరాలు ముంపునకు గురవుతాయి.
అందులో మహారాష్ట్రంలోనే అయిదువేలకు పైగా ఎకరాలు ముంపుకు గురవుతాయి. ఇందులో ఎక్కువ భాగం నదీ ప్రాంతానికి సంబంధించిన భూమి. అదనంగా ముంపుకు గురయ్యేది దాదాపు రెండువేల ఎకరాలు. ఈ నేపథ్యంలో ఫడ్నవీస్ ఎత్తు తగ్గించాలని కోరాగా... పరిశీలిస్తామని కేసీఆర్ చెప్పారు.
ఈ నేపథ్యంలో... బ్యారేజీ ఎత్తు 152 మీటర్లు అయితే 5.11 టీఎంసీలు, 151 మీటర్లు ఉంటే 3.9 టీఎంసీలు, 150 మీటర్లు అయితే 3.2 టీఎంసీల నీరు ఉంటుంది. ఈ ఎత్తు తగ్గిస్తే నీటిని మళ్లించేందుకు ఉన్న సమస్యలు, ఎదురయ్యే ఇబ్బందులపై అధ్యయనం చేయనున్నారు. మార్పు కుదరకుంటే మహారాష్ట్రను ఒప్పించి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications