హైదరాబాద్ రాష్ట్రపతి భవన్‌ను ఏడాది పొడవునా సందర్శించవచ్చు: టికెట్ బుక్ చేస్కోండిలా
ఇకపై ఏడాది పొడవునా ప్రజలు ఏడాది పొడవునా రాష్ట్రపతి భవనను సందర్శించుకోవచ్చు.
హైదరాబాద్: ఇకపై ఏడాది పొడవునా ప్రజలు ఏడాది పొడవునా రాష్ట్రపతి భవనను సందర్శించుకోవచ్చు. సామాన్య ప్రజలు, సందర్శకులు చూసేందుకు వీలుగా హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం వర్చువల్‌గా ప్రారంభించారు. రాష్ట్రపతి నిలయం ప్రాంగణంలోని నాలెడ్జ్ గ్యాలరీ, కిచెన్ టన్నెల్‌నూ ప్రారంభించారు.

రాష్ట్రపతి నిలయంలో పంచాంగ శ్రవణం
గత నెలలో రాష్ట్రపతి నిలయంలో బస చేసే అవకాశం దొరికిందని.. భవనం పూర్తి నిర్మాణ చరిత్ర తెలుసుకోవడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. తన హయాంలో బట్టర్ ఫ్లైరాక్, నక్షత్ర గార్డెన్, స్టెప్ వెల్స్, తెలంగాణ సంప్రదాయక కళతో కిచెన్ టన్నెల్ పునర్నిర్మాణం ప్రారంభించడం సంతోషంగా ఉందని ద్రౌపది ముర్ము హర్షం వ్యక్తం చేశారు.
అనంతరం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో కలిసి ఉగాది పర్వదినం సందర్భంగా పంచాంగ శ్రవణం కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు.

ఇకపై సామాన్యులకు ఏడాది పొడవునా రాష్ట్రపతి నిలయం సందర్శన
ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, హోంమంత్రి మహమ్మద్ అలీ, తదితరులు పాల్గొన్నారు. కాగా, ఇకపై డిసెంబర్ నెల మినహా మిగితా అన్ని రోజులూ సామాన్యులు కూడా రాష్ట్రపతి నిలయాన్ని సదర్శించుకోవచ్చని అధికారులు తెలిపారు. గురువారం నుంచి సందర్శకులు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించవచ్చు.
ఇంతకుముందు రాష్ట్రపతి శీతాకాల విడిది అనంతరం 15 రోజులపాటు ప్రజల సందర్శనకు అనుమతి ఉండేది.
రాష్ట్రపతి నిలయం సందర్శనకు ఆన్‌లైన్‌లోనూ టికెట్లు
అయితే, 162 ఏళ్ల రాష్ట్రపతి నిలయం చారిత్రక ప్రాధాన్యాన్ని అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో ఏడాది పొడవునా ప్రజల సందర్శనకు అవకాశం కల్పిస్తున్నారు. రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించుకునేందుకు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. రాష్ట్రపతి భవన్ అధికారిక వెబ్‌సైట్ నుంచి ఈ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. లేదంటే అక్కడికి వెళ్లి నేరుగా టికెట్లు తీసుకోవచ్చని అధికారులు తెలిపారు. కాగా, రిజిస్ట్రేషన్ రుసుమును భారతీయులకు రూ. 50, విదేశీయులకు రూ. 250గా నిర్ధారించారు. సందర్శకుల కోసం రాష్ట్రపతి నిలయంలో ఉచిత పార్కింగ్, వస్తువులు భద్రపర్చుకునేందుకు క్లాక్ రూం, వీల్ ఛైర్ సదుపాయం, ప్రాథమిక చికిత్స సహా ఇతర వసతులను ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications