ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన.. షెడ్యూల్ ఇదే; ట్రాఫిక్ మళ్లింపులు ఇలా!!
భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ మే 26వ తేదీన గురువారం నాడు హైదరాబాద్ లో పర్యటించనున్న విషయం తెలిసిందే. మే 26, గురువారం గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బి)ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించనున్నారు. అక్కడ నిర్వహించే ఐఎస్బి 20 సంవత్సరాల స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు.

ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఇదే
ఇక ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన షెడ్యూల్ విషయానికి వస్తే రేపు మధ్యాహ్నం 1.30 నిమిషాలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్టుకు ప్రధాని నరేంద్ర మోడీ చేరుకుంటారు. 1.45 నిమిషాలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ పార్కింగ్ లో బీజేపీ నేతలను కలుస్తారు. అనంతరం 1.50 కి హెలికాప్టర్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెలిప్యాడ్ కు చేరుకుంటారు. ఆపై హెలిప్యాడ్ దిగి రోడ్డు మార్గం ద్వారా రెండు కిలోమీటర్లు ప్రయాణించి ఐఎస్బి కి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటల నుండి 3. 15 నిమిషాల మధ్య ఐఎస్బి స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం నాలుగు గంటలకు తిరిగి బేగంపేటకు మోడీ చేరుకుంటారు.4.15 నిమిషాలకు బేగంపేట నుండి చెన్నైకి ప్రధాని నరేంద్ర మోడీ బయలుదేరుతారు.

మోడీ పర్యటన నేపధ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు
ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ మళ్లింపులను ప్రకటించారు. గురువారం మధ్యాహ్నం 1 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని వెల్లడించారు. గచ్చిబౌలి స్టేడియం నుండి IIIT జంక్షన్, IIIT జంక్షన్ నుండి విప్రో జంక్షన్, మరియు IIIT జంక్షన్ నుండి గచ్చిబౌలి మధ్య ఉన్న కార్యాలయాలు వారి పని సమయాలను ప్రధాని పర్యటన నేపథ్యంలో మార్చుకోవాలని లేదా అసౌకర్యాన్ని నివారించడానికి ఇంటి నుండి పని చేయడానికి మారాలని పోలీసులు సూచించారు. ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని కోరారు.

హైదరాబాద్ లో ట్రాఫిక్ మళ్లింపులు ఇలా
ఇక ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు విషయానికి వస్తే గచ్చిబౌలి జంక్షన్ నుండి లింగంపల్లి వైపు వెళ్లే ప్రయాణికులు గచ్చిబౌలి జంక్షన్, బొటానికల్ గార్డెన్ , కొండాపూర్ ఏరియా ఆసుపత్రి , మసీదు బండ , మసీదు బండ కమాన్ , హెచ్‌సియు డిపో రోడ్ మీదుగా వెళ్లాలని సూచించారు. లింగంపల్లి నుండి గచ్చిబౌలి వైపు వెళ్లే ప్రయాణికులు హెచ్‌సియు డిపో వద్ద నుండి వెళ్లాలని సూచించారు. విప్రో నుండి లింగంపల్లి వైపు వెళ్లే ప్రయాణికులు విప్రో జంక్షన్ , క్యూ సిటీ, గౌలిదొడ్డి , గోపన్‌పల్లి కూడలి, హెచ్‌సియు వెనుక గేటు, నల్లగండ్ల, లింగంపల్లి రోడ్డు వద్ద మళ్లింపు తీసుకోవాలని కోరారు.

మోడీ పర్యటన ట్రాఫిక్ మళ్లింపులపై వాహనదారులకు విజ్ఞప్తి
విప్రో నుండి గచ్చిబౌలి జంక్షన్ వైపు ట్రాఫిక్ విప్రో జంక్షన్ వద్ద మళ్లించవచ్చు. ఫెయిర్‌ఫీల్డ్ హోటల్, నానక్రామ్‌గూడ రోటరీ జంక్షన్ , ఔటర్ రింగ్ రోడ్ , ఎల్ అండ్ టి టవర్స్ మీదుగా గచ్చిబౌలి జంక్షన్ చేరుకోవచ్చని తెలిపారు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నుండి గచ్చిబౌలి జంక్షన్ వైపు వెళ్లే ప్రయాణికులు కేబుల్ బ్రిడ్జ్ అప్-ర్యాంప్ , జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 , రత్నదీప్ , మాదాపూర్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ , సైబర్ టవర్స్ , హైటెక్స్ , కొత్తగూడ - బొటానికల్ గార్డెన్ మీదు గచ్చిబౌలి వెళ్లొచ్చు అని తెలిపారు. ట్రాఫిక్ మళ్లింపులను దృష్టిలో పెట్టుకుని వాహనదారులు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రధాని పర్యటన నేపధ్యంలో ఆంక్షలు
రేపు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ ఐఎస్బి వేడుకలకు హాజరు కానున్న నేపథ్యంలో పోలీసులు పలు ఆంక్షలను విధించారు. పారా గ్లైడర్ లు, రిమోట్ కంట్రోల్ డ్రోన్ లు ఎగురవేయడాన్ని నిషేధించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఇప్పటికే ఎస్జీపి, ఐఎస్బీని అధీనంలోకి తీసుకుంది. ఇదిలా ఉంటే ప్రధాని మోడీ పర్యటన నేపధ్యంలో బీజేపీ నేతలు భారీ ఏర్పాట్లను చేస్తున్నారు.