నరేంద్రమోడీ అనే నేను.. ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేస్తానని ప్రమాణం చేస్తున్నాను!!
నరేంద్రమోడీ అనే నేను.. శాసనం ద్వారా నిర్మితమైన రాజ్యాంగంపట్ల విధేయతను కలిగివుండి ప్రజాస్వామ్యాన్ని కాపాడతానని ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి... చేతల్లోకి వచ్చేసరికి ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేస్తున్నారంటూ తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు మండిపడుతున్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాదని నియంతృత్వాన్ని నెలకొల్పాలనుకుంటున్నారా? అంటూ ప్రశ్నించారు.

మహారాష్ట్ర సంక్షోభం వెనక ఎవరున్నారో దేశం మొత్తం తెలుసు!!
మహారాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పడిన సంక్షోభం వెనక భారతీయ జనతాపార్టీ ఉందనేది దేశం మొత్తానికి తెలిసిన విషయమేనని, మీకు ప్రజలు మెజారిటీ ఇవ్వకపోతే ప్రభుత్వాలను ఏర్పాటు కానివ్వరా? అంటూ నిలదీస్తున్నారు. ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మధ్యప్రదేశ్, గోవా, కర్ణాటక, జమ్మూకశ్మీర్, అరుణాచలప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార తదితర రాష్ట్రాల్లో ప్రజలు ఓట్లేసి గెలిపించిన పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేయలేకపోయాయని, బీజేపీ తనవైపు తిప్పుకున్న ఎమ్మెల్యేలతో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందంటూ తాజాగా తెలంగాణ పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ధ్వజమెత్తారు.

దేశంలో ప్రజాస్వామ్యం ఉందా?
దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నట్లు ఎక్కడా కనిపించడంలేదని, ప్రజలు ఓట్లేసి గెలిపించినా ఆ ప్రభుత్వాలు ఎక్కువకాలం నిలుస్తాయన్న నమ్మకం కనపడటంలేదని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనమన్నారు. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వాలు ఇలా వ్యవహరించలేదని, ఒకటి రెండు మినహా ప్రతి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని బతికించడానికే ప్రయత్నించాయంటున్నారు.

నియంతలా చెలామణి అవుతోన్న మోడీ
నరేంద్రమోడీ, అమిత్ షాల హయాంలో దేశంలో నియంతృత్వం నెలకొందనే విషయం స్పష్టంగా అర్థమవుతోందన్నారు. మాట వింటే బీజేపీలో ఉండాలి.. మాట వినకపోతే సీబీఐ, ఐటీ, ఈడీలతో దాడులు చేయించి నియంతలుగా చెలామణి అవుతున్నారని, రాజ్యాంగంపట్ల విలువ లేదని, ప్రజాస్వామ్యంపట్ల గౌరవం లేదని, ప్రజల ఆస్తులతో ప్రభుత్వ రంగ సంస్థలను అభివృద్ధి చేసి ఆ తర్వాత వాటిని అదానీకి కట్టబెడుతున్నారని కమ్యూనిస్టు నేతలు మండిపడుతున్నారు.

జీవితకాలం అధికారం ఉంటుందా??
ఎల్లకాలం బీజేపీ అధికారంలో ఉంటుందనుకుంటున్నారేమోనని, కానీ ప్రభుత్వాలు మారినప్పుడు ఎవరి జాతకాలు ఏమిటనేది అన్నీ బయటకు వస్తాయని టీఆర్ ఎస్ శ్రేణులు అంటున్నాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇదే తరహా వ్యవహారమని, ఇష్టమొచ్చిన రీతిలో వ్యవహరిస్తూ ప్రధానమంత్రి పదవికే కళంకం తెస్తున్నారంటూ తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ధ్వజమెత్తుతున్నారు. ఈ తరహా వ్యవస్థను అరికట్టడానికే తమ నేత భారతీయ రాష్ట్ర సమితి పేరుతో ముందుకు వస్తున్నారని చెబుతున్నారు.