ప్రయివేటు కాలేజీల బంద్... యాజమాన్యాల ప్రకటన..!!
మరోసారి ప్రయివేటు ఇంజనీరింగ్ కాలేజీల బంద్ జరగనుంది. ఈ మేరకు ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విషయంలో నిర్లక్ష్యం చేస్తుందని సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. ఆ క్రమంలో నవంబర్ 3వ తేదీ నుంచి బంద్ పాటిస్తామని ప్రైవేట్ కళాశాలల సమాఖ్య వెల్లడించింది. అందులో భాగంగా అక్టోబర్ 22వ తేదీన ప్రభుత్వానికి నోటీసులు అందజేస్తామని స్పష్టం చేసింది.
మరోసారి తెలంగాణలో ప్రయివేటు కాలేజీలు బంద్ కానున్నాయి. ప్రయివేటు కాలేజీల సమాఖ్య కోర్ కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా అక్టోబర్ 25వ తేదీన విద్యార్థి సంఘాలతో.. 26వ తేదీన సర్వ సభ్య సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే నవంబర్ 1వ తేదీ నాటికి అన్ని పార్టీల నేతలతో సైతం కలిసి సమావేశం జరపాలని భావిస్తున్నాయి. అయితే ఈ బంద్‌లో ఇతర వృత్తి, విద్య కళాశాలలు సైతం పాల్గొంటున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో భాగంగా ప్రభుత్వం నగదు చెల్లించక పోవడం పట్ల ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే ఇంజినీర్స్ డేను బ్లాక్ డేగా నిర్వహిస్తామని ప్రకటించింది.

కాగా, ఈ ఏడాది సెప్టెంబర్ 15వ తేదీ నుంచి నిరవధిక బంద్ చేపట్టాలని తెలంగాణ కాలేజీల యాజమాన్యం ప్రకటించింది. దీంతో, ప్రభుత్వం యాజమాన్యంతో జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. చర్చలు జరిపిన అనంతరం వారం రోజుల్లో రూ. 600 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లిస్తామని.. అలాగే మిగిలిన బకాయిలు రానున్న దీపావళికి రూ. 600 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం.. కాలేజీల యాజమాన్యానికి హామీ ఇచ్చింది. దీపావళి వచ్చినా.. ప్రభుత్వం నుంచి బకాయిలు విడుదల కాలేదు. ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం ఏ ప్రకటన చేయకపోవడంతో.. ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యం మళ్లీ బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో, ఇప్పుడు ఈ నిర్ణయంతో ప్రభుత్వం బకాయిల విడుదల విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందీ... కాలేజీల బంద్ జరుగుతుందా అనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది.












Click it and Unblock the Notifications