షాక్: తుమ్మల చక్రం, తెరాసలోకి ఎమ్మెల్యే పువ్వాడ? రంగంలోకి జానా
ఖమ్మం: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరో వికెట్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలు జరగనున్న సమయంలో జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ అధికార టిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
మంత్రి, పాలేరు తెరాస అభ్యర్థి తుమ్మల నాగేశ్వర రావు స్వయంగా మంత్రాంగం నడిపి ఈ ఉదయం అజయ్‌తో చర్చలు జరిపారని తెలుస్తోంది. ఆపై తన ముఖ్య అనుచరులతో మాట్లాడి అభిప్రాయం తెలుసుకున్న అజయ్.. తెరాసలోకి జంప్ చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.

సోమవారం నాడు హైదరాబాదులో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమక్షంలో లేదా బుధవారం జరిగే తెరాస ప్లీనరీలో అజయ్ పార్టీ మారడం ఖాయమని అంటున్నారు. సీపీఐ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వర రావు తనయుడు పువ్వాడ అజయ్.
పువ్వాడ అజయ్ పార్టీ మారనున్నారనే ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత జానారెడ్డి రంగంలోకి దిగారు. పార్టీ తెలంగాణ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనకు ఫోన్ చేసి మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ పువ్వాడ అందుబాటులోకి రాలేదు. దీంతో జానా రెడ్డి ఫోన్ ద్వారా మంతనాలు జరిపినట్లుగా తెలుస్తోంది. తొందరపడవద్దని సూచించారని సమాచారం.












Click it and Unblock the Notifications