కులంపై సింధు: నజరానాగా వచ్చిన డబ్బుతో ఏం చేయాలో ఆలోచించలేదు
హైదరాబాద్: సోషల్ మీడియాలో తన కులంపై వస్తున్న పోస్టులపై ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధు స్పందించింది. ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఆమె మాట్లాడుతూ తన కులం భారతీయ కులం అని చెప్పింది. ఈ కులాల సంగతి తనకు తెలియదని ఆమె చెప్పింది.
తాను భారతీయురాలినని చెప్పిన సింధు, తాను ఒక కులానికి చెందిన దానిని కానని, మొత్తం దేశానికి చెందినదానిగా పేర్కొంది. తనకు నజరానాగా వచ్చిన మొత్తంతో ఏం చేయాలన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పింది. ప్రస్తుతానికి రియో ఒలింపిక్స్ విజయాన్ని ఆస్వాదిస్తున్నానని చెప్పింది.
తనకు మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది. విమర్శలను తాను పట్టించుకోనని చెప్పిన సింధు, ప్రస్తుతం తనకు లభిస్తున్న ప్రశంసలను ఆస్వాదిస్తున్నానని చెప్పింది. తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటే ఏదైనా సాధించవచ్చని సింధు చెప్పింది.

తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే తనలాగే అందరూ పతకాలు సాధిస్తారని చెప్పింది. తన తండ్రి ప్రముఖ వాలీబాల్ క్రీడాకారుడు కావడంతో తనను గతంలో పీవీ రమణ కూతురనేవారని, కానీ, ఇప్పుడు మాత్రం, 'సింధు ఫాదర్ పీవీ రమణ' అంటున్నారని, ఇదో కొత్త అనుభూతి అని నవ్వులు చిందిస్తూ సింధు చెప్పింది.
వచ్చే ఒలింపిక్స్ వరకు పతకం కోసం ఆగడం కంటే, అంతకు ముందు చాలా టోర్నీలు ఉన్నాయని, వాటిల్లో సాధించాల్సినది చాలా ఉందని చెప్పింది. రియో ఒలింపిక్స్‌లో అన్ని రౌండ్ల మ్యాచ్‌లు చాలా కఠినంగా ఉన్నాయని, సిల్వర్ మెడల్ సాధించడం తనకు సంతోషంగా ఉందని చెప్పింది.
భవిష్యత్ లోనూ బాగా ఆడాలనేదే తన ప్రధాన ఆశయమని సింధు పేర్కొంది. రియో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించడాన్ని ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నానని, తన తల్లిదండ్రులతో పాటు కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా ఎంతో కష్టపడ్డారని ఆమె చెప్పింది.












Click it and Unblock the Notifications