బీటెక్ తర్వాత ఇంటరా?: ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి విద్యార్హతపై ఈసీకి రఘునందన్ ఫిర్యాదు
హైదరాబాద్: బీఆర్ఎస్(టీఆర్ఎస్) ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి 2009 ఎన్నికల అఫిడవిట్‌లో బీటెక్ స్వీడన్‌లో పూర్తి చేసినట్లు పేర్కొన్నారని.. 2018 ఎన్నికల అఫిడవిట్‍లో మాత్రం ఇంటర్ చదివినట్లు ఉందని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. అంతేగాక, ఈ విషయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు.

ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి విద్యార్హతపై ఈసీకి ఫిర్యాదు
2009లో ఇంజినీరింగ్ చేసిన వ్యక్తి, మళ్లీ 2018లో ఇంటర్ చేస్తాడా? అని ప్రశ్నించారు. అధికారులు రోహిత్ రెడ్డి బయోడేటా అడగడానికి కారణం ఇదేమోనని రఘునందన్ తెలిపారు. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇస్తే అధికారులు కేసులు నమోదు చేస్తారని స్పస్టం చేశారు.
భారత ఎన్నికల సంఘానికి రోహిత్ రెడ్డి విద్యార్హతపై ఫిర్యాదు చేస్తున్నట్లు రఘునందన్ రావు తెలిపారు.

రోహిత్ రెడ్డికి డ్రగ్స్ అలవాటు?, ఆ ఫాంహౌజ్ దళితుల భూమి కాదా?
అంతేగాక, రోహిత్ రెడ్డి మొయినాబాద్ ఫాంహౌజ్ దళితుల అసైన్‌మెంట్ భూమిలో ఉందా? లేదా? చెప్పాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఆ భూమిని కబ్జా చేయలేదా? అని ప్రశ్నించారు. రోహిత్ రెడ్డికి నందు, సింహయాజీలతో వ్యాపార లావాదేవీలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఆ ముగ్గురికి సంబంధించిన కాల్ డేటా బయటకు తీస్తే అన్ని నిజాలు తెలుస్తాయన్నారు. రోహిత్ రెడ్డికి డ్రగ్స్ అలవాటు లేదని భాగ్యలక్ష్మి అమ్మవారి మీద ప్రమాణం చేయాల్సిందని సవాల్ విసిరారు.

హరీశ్ రావు అడ్డదారిలో మంత్రి అయ్యారంటూ రఘునందన్
బీఆర్ఎస్‌కు ప్రమాణాల మీద ఎప్పుడు నమ్మకం వచ్చిందని ప్రశ్నించారు. ఈడీ దాడుల విషయంలో భాగ్యలక్ష్మి అమ్మవారిపై ప్రమాణం చేయాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు రోహిత్ రెడ్డి సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రఘునందన్ పై వ్యాఖ్యలు చేశారు.
ఈడీ కేసును వేగవంతం చేయాలని బండి సంజయ్ చెప్పారన్నారు. ఈడీ గురించి బండి సంజయ్ ప్రెస్‌మీట్ చూసి మాట్లాడాలని హితవు పలికారు. హరీశ్ రావు ఎమ్మెల్యే కాకముందు అడ్డదారిలో మంత్రి అయ్యారని విమర్శించారు. ఆయనకు తమ పార్టీ అధ్యక్షుడి గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు రఘునందన్ రావు.












Click it and Unblock the Notifications