ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచేందుకు బీఆర్ఎస్ రూ. 30 కోట్లు సిద్దం: ఈసీకి రఘునందన్ రావు ఫిర్యాదు
వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ నేత, మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఎన్నికల్లో రూ.30 కోట్లతో ఓట్ల కొనుగోలుకు బీఆర్ఎస్ పార్టీ తెరలేపిందని చెప్పారు.
డబ్బులు పంచి గెలవాలని ప్రయత్నం చేస్తున్నందుకు బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు కొనాలన్న బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం ఆపాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‌కు రఘునందన్ రావు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు.

ఓ బ్యాంక్‌లోని బీఆర్ఎస్ అధికారిక ఖాతా నుంచి 30 మంది ఎన్నికల ఇంఛార్జులకురూ. కోటి చొప్పున నగదు బదిలీ జరిగినట్లు రఘునందన్ ఆరోపించారు. అంతేగాక, బ్యాంక్ అకౌంట్ వివరాలను ఎన్నికల సంఘానికి రాసిన లేఖతో జతపరిచారు. దీనిపై వెంటనే చర్యలు చేపట్టాలని లేకుంటే కోట్లాది రూపాయలను ఓట్ల కొనుగోలుకు ఉపయోగిస్తారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ఖాతాను వెంటనే ఫ్రీజ్ చేసి విచారణ జరపాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ డబ్బు ద్వారా మాత్రమే ఎన్నికలు గెలవాలనే దుర్మార్గమైన ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కారు పార్టీ చిల్లర ప్రయత్నాలు చేసిందని రఘునందన్ రావు విమర్శించారు.
ఇది ఇలావుండగా, సోమవారం (మే 27వ తేదీన) జరిగే వరంగల్ - నల్గొండ - ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు చేపట్టింది. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మహబూబాబాద్ జిల్లాలో 36 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 34,933 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.












Click it and Unblock the Notifications