తెలంగాణలోకి రాహుల్ గాంధీ - రేవంత్ కు పరీక్షా సమయం..!!
కాంగ్రెస్ అగ్రనేత భారత్ జోడో యాత్ర నేటి నుంచి తెలంగాణలో కొనసాగనుంది. తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మక్తల్ దగ్గర కృష్ణానది బ్రిడ్జి మీదుగా రాష్ట్రంలో మొదలయ్యే రాహుల్ యాత్ర నవంబర్ 8వ తేదీ వరకు కొనసాగుతోంది. తెలంగాణలో మొత్తం 375 కిలో మీటర్లు యాత్ర రూట్ మ్యాప్ ఖరారైంది. తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మక్తల్ దగ్గర కృష్ణానది బ్రిడ్జి మీదుగా రాష్ట్రంలో మొదలయ్యే యాత్ర నేడు 13 కిలో మీటర్లు మేర సాగనుంది. మరిక్కల్ వద్ద తెలంగాణ తొలి రోజు యాత్రలో భాగంగా రాహుల్ ప్రసంగానికి ఏర్పాట్లు చేసారు. ఆ వెంటనే శంషాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తారు.
దీపావళి కావటంతో మూడు రోజుల పాటు యాత్రకు విరామం ప్రకటించారు. 26వ తేదీన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గే ప్రమాణ స్వీకారం తరువాత రాహుల్ తిరిగి తెలంగాణకు వస్తారు. 27వ తేదీ ఉదయం నుంచి తెలంగాణలో యాత్ర కొనసాగుతోంది. ఈ నెల 31న జోడో యాత్ర హైదరాబాద్ లోకి ప్రవేశిస్తుంది. హైదరాబాద్ లో చార్మినార్ నుంచి యాత్ర ప్రారంభమై గాంధీ భవన్ మీదుగా నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు చేరుకుంటుంది. ఇందిరాగాంధీ వర్దంతి సందర్బంగా నెక్లెస్ రోడ్ లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. అదే రోజున నగరంలో రాహుల్ తో కలిసి సోనియా గాంధీ - ప్రియాంక జోడో యాత్రలో పాల్గొంటారని చెబుతున్నారు. కానీ, అధికారికంగా నిర్దారణ కావాల్సి ఉంది.

ఇక, ఇప్పుడు ఇటు రాహుల్ యాత్ర ..అటు మునుగోడు ఉప ఎన్నిక రెండు టీపీసీసీ నేతలకు..ప్రధానంగా చీఫ్ రేవంత్ సమర్దతకు పరీక్షగా మారాయి. రాహుల్ యాత్రకు ఇప్పటి వరకే నిర్వహించిన ప్రాంతాల్లో అనూహ్య స్పందన వచ్చింది. తెలంగాణలో వచ్చే ఎన్నికలకు ఈ యాత్ర పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచుతుందని ఆశిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి పార్టీ పలు కమిటీలను ఏర్పాటు చేసింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ తో పాటుగా వేణుగోపాల్ స్వయంగా తెలంగాణలో రాహుల్ యాత్ర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. టీఆర్ఎస్ వర్సస్ బీజేపీ అన్నట్లుగా మారిన తెలంగాణ రాజకీయంలో ఇప్పుడు రాహుల్ పాదయాత్రతో ఎటువంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.












Click it and Unblock the Notifications