రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఫోన్
SLBC Tunnel: ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న 8 మంది ఇంజినీర్, కార్మికులను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం సహాయక ముమ్మరంగా కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్ఎల్బీసీ వద్ద బాధితులను రక్షించేందుకు జరుగుతున్న సహాయక చర్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గ్ గాంధీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఆరా తీశారు. ఇద్దరు నేతలు దాదాపు 20 నిమిషాలపాటు మాట్లాడుకున్నారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం జరిగిన వెంటనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లారని రాహుల్ కు సీఎం రేవంత్ తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీంలు వెళ్లాయని చెప్పారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్బంగా ఎస్ఎల్బీసీ ఘటనపై ప్రభుత్వ చర్యలను రాహుల్ అభినందించారు.

సొరంగంలో చిక్కుకున్నవారిని సురక్షితంగా బయటకు తీసేందుకు అన్ని చర్యలూ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ సూచించారు. ఇది ఇలావుండగా, ప్రధాని నరేంద్ర మోడీ శనివారం సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనపై ఆరా తీసిన విషయం తెలిసిందే. ఘటనపై పూర్తి వివరాలను ప్రధానికి తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు సహాయక చర్యలు ప్రారంభించినట్లు ప్రధానికి తెలిపారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో చిక్కుకున్నవారిని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వానికి అన్ని విధాలా సాయం చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి హామీ ఇచ్చారు. సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని ప్రధానికి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
సహాయక చర్యల కోసం వెంటనే ఎన్డీఆర్ఎఫ్ టీంను పంపిస్తామని సీఎంకు ప్రధాని మోడీ చెప్పారు. పూర్తిస్థాయి సహకారం అందించేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర హామీ ఇచ్చారు. కాగా, ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనా స్థలానికి శనివారం రాత్రి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదివారం ప్రమాద స్థలికి వెళ్లి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. 24 మందితో కూడిన ఆర్మీ బృందం సహాయక చర్యల్లో పాల్గొంది. ఇంకా, సహాయక చర్యల్లో 130 మంది ఎన్డీఆర్ఎఫ్, 24 మంది హైడ్రా టీం, 24 మందితో కూడిన సింగరేణి కాలరీస్ రెస్క్యూ టీం, 120 ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు కూలిన ఘటనలో 8 మంది ప్రాజెక్టు సిబ్బంది చిక్కుకున్న విషయం తెలిసిందే. వారిని కాపాడేందుకు ముమ్మర యత్నాలు జరుగుతున్నాయి. అయితే, ఘటనా స్థలంలో కూలిన మట్టి, నీరు ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతున్నాయి.












Click it and Unblock the Notifications