ఖమ్మం సభ వైపే అందరి చూపు -భట్టికి అరుదైన గుర్తింపు..!!
ఇప్పుడు తెలంగాణలో అందరి చూపు ఖమ్మం సభ వైపే ఉంది. భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ యాత్ర ముగింపు..పొంగులేటి చేరిక కోసం ఈ సభ నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ కాంగ్రెస్ సత్తా చాటేలా ఈ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ అగ్ర నేతలు ఈ సభకు తరలి వస్తున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ థాక్రే స్వయగా భట్టి పాదయాత్ర శిబిరం వద్దకు వెళ్లి సభ ఏర్పాట్లపై చర్చించారు. జనగర్జనగా నిర్ణయించిన ఈ సభలో రాహుల్ గాంధీ పాదయాత్ర చేసిన భట్టికి సత్కారం ద్వారా అరుదైన గుర్తింపు దక్కించుకోనున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ జోష్ : తెలంగాణ కాంగ్రెస్ తో తుఫాను మొదలైందని నేతలు ప్రకటిస్తున్నారు. ఎన్నికల వేళ పార్టీలో వస్తున్న జోష్ తో రాహుల్ సైతం హ్యాపీ ఫీలవుతున్నారు. ఎన్నికల వరకు ఇదే స్పూర్తిని కొనసాగిస్తూ అధికారం దక్కించుకోవటమే లక్ష్యంగా పని చేయాలని నిర్దేశించారు. ఇప్పుడు తెలంగాణలో భట్టి పాదయాత్ర పార్టీలో సైలెంట్ సునామీగా మారింది.

ఎన్నికల వేళ పార్టీ కేడర్ లో జోష్ పెంచింది. భట్టి అన్ని వర్గాల ప్రజలతో మమేకం అవుతూ చేసిన యాత్రను పార్టీ హైకమాండ్ గుర్తించింది. ఈ యాత్ర ద్వారా పార్టీలో..ప్రజల్లో వచ్చిన స్పందనకు గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం ఖమ్మం సభలో లక్షలాది కార్యకర్తల సమక్షంలో భట్టిని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ పార్టీ తరపున సత్కరించనున్నారు.
ఖమ్మం సభకు రాహుల్ గాంధీ : భట్టి పాదయాత్ర సభకు రాహుల్ వస్తుండటం.. కొద్ది రోజుల క్రితం ఖర్గే రావటం తో కాంగ్రెస్ నాయకత్వంలో భట్టి యాత్రకు గుర్తింపు దక్కింది. విడివిడిగా ఉండే పార్టీ నేతలు భట్టి యాత్ర సమయంలో ఒక్కటయ్యారు. కలిసి ముందుకు సాగారు. దీనిని పార్టీ గుర్తించింది. పార్టీ కేడర్ సైతం ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ భట్టి పాదయాత్ర గురించి చర్చించుకున్నారు.
భట్టి పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రధాన అంశాలుగా మారే అవకాశం ఉంది. పార్టీలో ముఖ్యుల చేరికల పైన భట్టి చేసిన ప్రయత్నాలు సఫలం అయ్యాయి. అన్నింటికీ సరైన వేదిక ఖమ్మంగా నిర్ణయించారు. ఎన్నికల వేళ జరుగుతున్న ఈ సభలో భట్టికి సత్కారం.. ముఖ్య నేతల చేరికలు..తెలంగాణ భవిష్యత్ కు కాంగ్రెస్ తీసుకొనే నిర్ణయాలను వెల్లడించేందుకు నిర్ణయించారు.

భట్టి చారిత్రాత్మక యాత్ర ముగింపు సభగా.. పొంగులేటి చేరిక వేదికగా ఈ సభను నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ సభ ద్వారా కాంగ్రెస్ అధికారం లోకి వస్తూనే దగా పడిన తెలంగాణ ప్రజల కోసం ఏం చేయనుందీ స్పష్టత ఇవ్వనున్నారు. ఖమ్మం సభకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు తరలి వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభంజనం ఖమ్మం నుంచే మొదలు కానుంది. ఈ సభ కోసం ఏర్పాట్లు ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications