టాలీవుడ్ యంగ్ హీరో ఫామ్‌హౌస్ అక్రమాలు: పోలీసుల దాడుల్లో షాకింగ్: 20 మంది అరెస్ట్
హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్యకు చెందిన ఫామ్‌హౌస్.. అక్రమాలకు నిలయంగా మారింది. క్యాసినోగా తయారైంది. ఈ ఫామ్‌హౌస్‌పై పోలీసులు నిర్వహించిన దాడుల్లో దిగ్బ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయిదు కాదు.. పదీ కాదు.. 20 మంది ఈ ఫామ్‌హౌస్‌లో మకాం వేశారు. పేకాట క్లబ్‌గా మార్చివేశారు. దీనిపై పక్కా సమాచారం అందడంతో హైదరాబాద్ పోలీసులు మెరుపుదాడి చేశారు. పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు.
పేకాట ఆడుతున్న 20మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పెద్దమొత్తంలో నగదు, సెల్‌ఫోన్లు, కార్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ శివార్లలోని రాజేంద్రనగర్ మంచిరేవుల వద్ద ఉందీ ఫామ్‌హౌస్. ఇదొక విల్లా. చాలాకాలం కిందటే నాగశౌర్య దీన్ని నిర్మించారు. ఫామ్‌హౌస్‌గా వాడుతున్నారు. ఏదైనా సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్‌ను వినడానికి ఆయన అక్కడికే వెళ్తుంటారు. కొద్ది రోజుల కిందట గుత్తా సుమన్ కుమార్ అనే వ్యక్తి- ఈ విల్లాను అద్దెకు తీసుకున్నారు.

బర్త్ డే వంటి ఫంక్షన్లు, కార్పొరేట్ వీకెండ్ పార్టీలను నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో ఆయన ఈ విల్లాను క్యాసినోగా మార్చేసినట్లు చెబుతున్నారు. పేకాటరాయుళ్ల స్థావరంగా మార్చివేశారని అంటున్నారు. పేకాట క్లబ్‌గా మార్చడం వల్ల గుత్తా సుమాన్ కుమార్.. ప్రతినెలా పెద్ద ఎత్తున ఆదాయాన్ని చవి చూస్తున్నాడని సమాచారం. దీనిపై ఫిర్యాదు అందడంతో పోలీసులు మెరుపుదాడి నిర్వహించారు. 20 మందిని అదుపులోకి తీసుకున్నారు.

వారి నుంచి పెద్ద ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నారు. 6,70,000 రూపాయల నగదు మొత్తంతో పాటు 33 సెల్ ఫోన్లు, 24 కార్లు, కొన్ని క్యాసినో బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు గుత్తా సుమన్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సెల్ ఫోన్ కాల్ లిస్ట్ ఆధారంగా అతని గురించి ఆరా తీస్తున్నారు. ఫామ్‌హౌస్‌ను పేకాట స్థావరంగా మార్చిన విషయం నాగశౌర్యకు తెలియదని అంటున్నారు. తనకు రావాల్సిన అద్దె ప్రతినెలా క్రమం తప్పకుండా అందుతుండటం వల్ల ఆయన దాని నిర్వహణపై పెద్దగా దృష్టి పెట్టలేదని చెబుతున్నారు. దీనిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications