తెలంగాణకు రెయిన్ అలర్ట్.. పలు జిల్లాల్లో వర్షాలు..
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మరో నాలుగైదు రోజులు భారీ వర్షాలు కురవనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారులు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. బంగాళాఖాతంలో నెలకొన్న ఆవర్తనం ప్రభావంతో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు వివరించారు. హైదరాబాద్ నగరంలో నేటి సాయంత్రం నుంచి రాత్రివరకూ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
నగరంలోని భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో నేడు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వివరించారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు.

బంగాళాఖాతంలో గాలి వేగం 35 కిలోమీటర్ల నుంచి 45 కిలోమీటర్లు మేర ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నట్లు చెబుతున్నారు.
భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయం..
నిన్న(శనివారం) రాత్రి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో కుండపోత వర్షం పడింది. నిన్న సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ చెరువులను తలపించాయి. భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ నెలకొంది.












Click it and Unblock the Notifications