తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రెండురోజులపాటు వర్షాలు..
తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ వేడితో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఇప్పటివరకూ 43 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే గత మూడు రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం ప్రారంభించాయి. ఇక, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కూడా కురిసాయి. అయితే, తాజాగా తెలంగాణకు వాతావరణశాఖ ఓ చల్లని కబురు తీసుకొచ్చింది. రాష్ట్రంలో రెండుమూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు.
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. రాష్ట్రంలోని నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ములుగు, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, కామారెడ్డి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడే సూచనలున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు..
ఇక, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం (ఏప్రిల్ 10) చిరు జల్లులు కూడా కురిశాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో 41.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయిందని అధికారులు అంటున్నారు. వీటితోపాటు నల్గొండ జిల్లాలోని మాడుగులపల్లిలో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత, వనపర్తి జిల్లా కొత్తకోటలో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత, జయశంకర్ భూపాలపల్లి రోగొండలో 41డిగ్రీల ఉష్ణోగ్రతలు, ములుగు జిల్లా తాడ్వాయిలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు, మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో 40.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఐఎండీ తెలిపింది.












Click it and Unblock the Notifications