తెలంగాణ ప్రజలకు మరో మూడు రోజులు అలర్ట్
తెలంగాణ రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం కొనసాగుతోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతుండగా.. సాయంత్రం నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు పడుతున్నాయి. తాజాగా మరి కొన్ని రోజులు ఇదే వాతావరణం కొనసాగే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో బుధవారం పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇదే సమయంలో కొన్ని జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, మరికొన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.

గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులతో పాటు ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తాజా ప్రకటనలో వెల్లడించింది. ఇక, రాగల మూడు రోజులు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
మరోవైపు, రాగల మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ ఎత్తులో కొనసాగిన ఉపరితల చక్రవాత ఆవర్తనం బుధవారం బలహీన పడిందని వెల్లడించింది.
కాగా, మంగళవారం సాయంత్రం నుంచి హైదరాబాద్ తోపాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాల్లో ఈదురు గాలులు వీచాయి. రామ్ నగర్, విద్యానగర్, ఖైరతాబాద్, అమీర్‌పేట, లక్డీకాపూల్, హిమాయత్‌నగర్, మధురానగర్, పంజాగుట్ట, బషీర్‌బాగ్, నారాయణగూడ, అబిడ్స్, కోఠి పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది.
మంగళవారం మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రతతో ఉక్కిరిబిక్కిరైన నగరవాసులకు ఈ వర్షంతో ఉపశమనం కలిగింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో నగరవాసులు ఉక్కపోత నుంచి తప్పించుకున్నారు. అయితే, పలు ప్రాంతాల్లో కురిసిన వర్షంతో రహదారులపైకి వర్షం నీరు రావడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు, ఈదురుగాలులు వీయడంతో పలు ప్రాంతాల్లో కొద్దిసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.












Click it and Unblock the Notifications