దంచికొడుతున్న వర్షాలు; భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ఇలా; తాజా సమాచారమిదే!!
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాలలో జల జీవనం స్తంభించింది. రోడ్లపైకి నీరు చేరుకుని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసిన నేపధ్యంలో పలు జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది.
ఉత్తర తెలంగాణ 5 జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో అధికారులు వరద సహాయక చర్యలపై దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలో స్థానిక అధికారులు జలాశయాలలో నీటి మట్టం, ఎత్తు తక్కువ కల్వర్తులు, రహదారులు, లోతట్టు ప్రాంతాలపై నిఘా ఉంచి ఎప్పటి కప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

పలు జిల్లాల కలెక్టరేట్ లలో ఇప్పటికే కంట్రోల్ రూమ్ లను, హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేశారు. మరో వైపు ఉత్తర, మధ్య తెలంగాణా జిల్లాలలో పలు చోట్ల ఈ రోజు మూడో రోజూ వర్షాలు కొనసాగుతున్నాయి. ఇలా ఉండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, దుమ్ముగూడెం లలో నిన్న 11.9 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా గజ సింగారం వద్ద ఈ ఉదయం నుంచీ అత్యధికంగా 3.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిద్దిపేట్ జిల్లా రాఘవాపూర్ వద్ద 3.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ జిల్లాలతో పాటూ, ములుగు, కామారెడ్డి, ఖమ్మం, మహబూబ్ నగర్ , వరంగల్ జిల్లాలలో పలు చోట్ల ఉదయం నుండి ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి.
ఇలా ఉండగా హైదరాబాద్ లో నిన్నటి నుంచీ పలు ప్రాంతాలలో ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా శేరిలింగం పల్లి వద్ద 4.6సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, గోల్కొండ వద్ద 4.1సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది ఇలా ఉండగా, ఈ రోజు, రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా కురిసే అవకాశం ఉండని హైదరాబాద్ వాతావరణ కేంద్ర హెచ్చరించింది.

కాగా ఓవైపు రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో పాటు మరోవైపు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. రెండు క్రితం 14 అడుగుల నీటిమట్టం ఉన్న గోదావరి నది నిన్న సాయంత్రానికి 19 అడుగులకు చేరుకోగా, నేడు 11 గంటల వరకు 29 అడుగులకు పెరిగింది.
ఈ రోజు రాత్రికి గోదావరి నీటిమట్టం 35 అడుగులకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ ఆదేశించడంతో అధికారులు రెడీ అవుతున్నారు.












Click it and Unblock the Notifications