కరోనా బాధితుల హాహాకారాలు వినపడవా?: సీఎం కేసీఆర్‌పై విజయశాంతి, రాజా సింగ్ తీవ్ర విమర్శలు
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత విజయశాంతి మరోసారి తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని సీఎం కేసీఆర్ గాలికి వదిలేశారని మండిపడ్డారు. ప్రైవేటు హాస్పిటళ్లలో కోవిడ్ చికిత్స ఫీజులపై నియంత్రణ లేదని విమర్శించారు.

ప్రజలు అల్లాడుతుంటే గడీలో దొరకు వినపడటం లేదా?
ప్రైవేటు ఆస్పత్రుల్లో పీజులు కట్టలేక ప్రజలు అల్లాడుతుంటే గడీలో ఉన్న దొరకు కరోనా బాధితుల హాహాకారాలు వినిపించడంలేదని దుయ్యబట్టారు. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలు చేసి ఉంటే కరోనా చికిత్సలో రూ.5 లక్షల వరకు కేంద్రమే చెల్లిస్తుందని విజయశాంతి వ్యాఖ్యానించారు. ఆయుష్మాన్ భారత్ స్కీంలో చేరనందుకు రాష్ట్రం రూ.200 కోట్లు కోల్పోయిందన్నారు.

కేసీఆర్ బంధువర్గం కోసమేనా..?
తన బంధువులు, అనుచరుల హాస్పిటళ్లకు రోజూ కోట్లలో వస్తున్న ఆదాయాన్ని కాపాడేందుకే కేసీఆర్ ఆయుష్మాన్ భారత్‌ను, ఆరోగ్యశ్రీని అమలు చేయట్లేదా? అని విజయశాంతి నిలదీశారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేయనందుకు నిరసనగా... ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చాలన్న డిమాండ్‌తో జరగబోతున్న "గరీబోళ్ల కోసం బీజేపీ దీక్ష"ను విజయవంతం చేయాలన్నారు.

కరోనాతో ప్రజలు అప్పులపాలవుతున్నారు..
కరోనా చికిత్సలో రూ.5 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం చెల్లించే ఆయుష్మాన్ భారత్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ లేకపోవడంతో రాష్ట్ర ప్రజలు అప్పుల పాలవుతున్నారని మండిపడ్డారు. కరోనా బారిన పడి రాష్ట్రంలో ప్రజలు వేలల్లో చనిపోతున్నారని.. లక్షల మంది కరోనా బాధిత కుటుంబాలు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫీజులు చెల్లించలేక ఆర్థికంగా కుదేలయ్యాయని తెలిపారు.

‘గరీబోళ్ల కోసం బీజేపీ దీక్ష’.. రాజాసింగ్ పిలుపు
ఆరోగ్యశ్రీలో కూడా కరోనా చికిత్సను చేర్చడం లేదని రాజా సింగ్ మండిపడ్డారు. సర్కార్ ఆస్పత్రులకు పోలేక, ప్రైవేటు హాస్పిటల్స్‌లో ఫీజులు చెల్లించలేక కరోనా బాధితులు ప్రాణాలు వదులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయనందుకు నిరసనగా, ఆరోగ్యశ్రీలో కోవిడ్ చికిత్సను చేర్చాలన్న డిమాండ్‌తో మే-19న రాష్ట్ర బీజేపీ చేపట్టబోయే "గరీబోళ్ల కోసం బీజేపీ దీక్ష" ను విజయవంతం చేయాలని రాజాసింగ్ పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications