పాతికేళ్ల నిరీక్షణ తర్వాత ఆ ప్రాంతంలో భారీ రైల్వే లైన్.. మేడారం మీదుగా.. పండుగే!
పాతికేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఒక సరికొత్త రైల్వే ప్రాజెక్టు పట్టాలు ఎక్కడానికి సిద్ధమైంది. ఉత్తర తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చే సరికొత్త రైల్వే ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్ర రైల్వే ప్రగతికి బాటలు వేయనుంది. రామగుండం- మణుగూరు మధ్య కొత్త రైల్వే లైను ఏర్పాటు చేయాలన్న చిరకాల కల ప్రస్తుతం సాకారం అవుతుంది.
ఆ ప్రాంతవాసుల చిరకాల వాంఛ తీరిన వేళ.. భారీరైల్వే ప్రాజెక్ట్
రామగుండం మణుగూరు రైల్వే ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం కాకుండా పనులు వేగవంతం చేయడానికి 2026- 27 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ లో భారీ నిధులను సైతం కేటాయించింది. 2911. 84 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ రైల్వే ప్రాజెక్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఎంతోకాలంగా రామగుండం మణుగూరు ప్రాంత ప్రజల నిరీక్షణకు తెరపడినట్లయింది.

ఈ రైల్వే ప్రాజెక్ట్ తో వ్యూహాత్మక కోల్ కారిడార్
ఈ రైల్వే ప్రాజెక్ట్ ఏర్పాటుతో వెనుకబడిన అనేక ప్రాంతాలకు రవాణా సులభతరం అవడంతో, ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ కొత్త రైల్వే మార్గం ప్రయాణికులను చేరవేయడానికి మాత్రమే కాకుండా, సింగరేణి బొగ్గు గనుల ప్రాంతాలను కలుపుతూ ఒక వ్యూహాత్మక కోల్ కారిడార్ అవుతుంది. దీనివల్ల బొగ్గు రవాణా వ్యయం గణనీయంగా తగ్గడం మాత్రమే కాకుండా, రవాణా ప్రక్రియ మరింత వేగవంతం అవుతుంది.
భద్రాచలం నుండి రామగుండం వరకు తగ్గనున్న దూరం
ప్రస్తుతం భద్రాచలం నుండి రామగుండం వరకు చేరుకోవడానికి సుమారు 286 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవలసి ఉండగా, ఈ కొత్త రైలు మార్గం అందుబాటులోకి వస్తే 90 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుంది. ఇటు సింగరేణికి, అటు ప్రయాణికులకు ఇది గొప్ప ఊరట నిచ్చే అంశంగా ఉంటుంది.
మేడారం మీదుగా రైల్వే మరో విశేషం
ఈ నూతన 207.80 కిలోమీటర్ల పొడవైన రైలుమార్గం పెద్దపల్లి జిల్లాలోని రాఘవపూర్ వద్ద ప్రారంభమై మంథని, భూపాలపల్లి, మేడారం, తాడ్వాయి. కాటారం మీదుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు వరకు సాగుతుంది. ముఖ్యంగా ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం జాతర జరిగే ప్రాంతానికి దగ్గరగా ఈ రైలు సౌకర్యం ఏర్పాటు కావడం ప్రాజెక్టులో ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పవచ్చు.
ఆ సెక్షన్ లకు బలమైన ప్రత్యామ్నాయ మార్గం
గత సంవత్సరం మే నెలలో భూసేకరణ కోసం ప్రకటన వెలువడగా ఇప్పటికే చాలా జిల్లాలలో భూ పరీక్షలు పూర్తయ్యాయి. పనులు కూడా ప్రారంభమవుతున్నాయి. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే న్యూఢిల్లీ చెన్నై గ్రాండ్ ట్రంక్, నాగపూర్, విజయవాడ సెక్షన్లకు ఇది ఒక బలమైన ప్రత్యామ్నాయ మార్గం అవుతుంది.
వచ్చే 10-15 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యం
దీనిని భద్రాచలం కొవ్వూరు మార్గంతో అనుసంధానిస్తే విశాఖపట్నం పోర్టు వరకు రవాణా సౌకర్యాలు మెరుగుపరిచే అవకాశం ఉంటుందని భవిష్యత్తు ప్రణాళిక పైన అధికారులు ప్లాన్ చేస్తున్నారు. రూ.4 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ భారీ రైలు ప్రాజెక్టును వచ్చే 10-15 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.













Click it and Unblock the Notifications