ఒకే వేదికపై రేవంత్ రెడ్డి, చంద్రబాబు..ఎందుకంటే..?
పద్మవిభూషణ్ రామోజీరావు జయంతి సందర్భంగా రామోజీ ఫిల్మ్ సిటీలో 'రామోజీ ఎక్సలెన్స్ జాతీయ అవార్డుల' ప్రదానోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రులు చంద్రబాబు , రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రామోజీరావును ఎక్సలెన్స్‌కు ప్రతిరూపంగా అభివర్ణించారు. సాధారణ వ్యక్తి అసాధారణ శక్తిగా ఎదిగారు.
నమ్మిన సిద్ధాంతం కోసం దేన్నయినా వదులుకున్నారు. 40 ఏళ్ల నా అనుబంధంలో ఆయన ఏ వ్యక్తిని చిన్న ఫేవర్ కూడా అడగలేదని గుర్తు చేసుకున్నారు. నిఖార్సయిన జర్నలిజంతో తెలుగు భాషకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రతిపక్షం బలహీనంగా ఉంటే తానే అపోజిషన్‌గా పనిచేస్తానని చెప్పేవారు. రామోజీ స్ఫూర్తితో తెలుగు భాషను పరిరక్షించేందుకు కృషి చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ అవార్డులు భవిష్యత్తులో జ్ఞానపీఠ్, పులిట్జర్ స్థాయికి ఎదుగుతాయని ఆకాంక్షించారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రామోజీరావును 'ఒక పేరు కాదు.. ఒక బ్రాండ్‌గా పేర్కొన్నారు. రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి రామోజీ ఫిల్మ్ సిటీ ఒక గొప్ప ఎస్సెట్ అని, చార్మినార్, గోల్కొండ, హైటెక్ సిటీ పక్కన నాలుగో వండర్‌గా ఫిల్మ్ సిటీ నిలిచిందని ప్రశంసించారు.
నిద్రలేవగానే ఈనాడు చదవడం, నిద్రపోయే ముందు ఈటీవీ వార్తలు చూడటం ప్రజలకు అలవాటుగా మారిందని, వాస్తవాలను అందించాలనే తపన రామోజీ గ్రూప్‌లో కనిపిస్తుందని తెలిపారు. రామోజీరావు ఆలోచనలను భవిష్యత్ తరాలకు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. జర్నలిజం, సేవా రంగం, సైన్స్ అండ్ టెక్నాలజీ సహా పలు విభాగాల్లో విశిష్ట సేవలందించిన వారికి ఈ జాతీయ అవార్డులను ప్రధానం చేశారు.












Click it and Unblock the Notifications