హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు: ఈ రూట్‌లో వెళ్లొద్దు..!!
Hyderabad traffic: రంజాన్ పండుగను పురస్కరించుకుని గురువారం హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ముస్లింలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనాల్సి ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పలు ప్రాంతాల్లో ఈ ఆంక్షలు ఉదయం నుంచి 11:30 గంటల వరకు అమలులో ఉంటాయి.
మీరాలం ట్యాంక్ ఈద్గా, హాకీ గ్రౌండ్, మాసబ్‌ట్యాంక్ పరిసరాలలో ఈ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఆంక్షలు అమలులో ఉన్న సమయంలో ఆ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లను ఎంచుకోవాలని సూచించారు.

రంజాన్ ప్రార్థనల కోసం మీరాలం ఈద్గా వెళ్లే వారి వాహనాలను పురానాపూల్, కామాటిపుర, కిషన్‌బాగ్, బహదూర్‌పురా క్రాస్ రోడ్స్ మీదుగా అనుమతిస్తారు. ఈ సమయంలో సాధారణ వాహనదారులను బహదూర్‌పురా క్రాస్ రోడ్స్ నుంచి ఈద్గా వైపు వెళ్లడానికి అనుమతి ఉండదు. బహదూర్‌పురా క్రాస్ రోడ్డు నుంచి కిషన్‌బాగ్, కామాటిపుర వైపు వెళ్లాల్సి ఉంటుంది.
మీరాలం ఈద్గాకు వెళ్లే వారు తమ వాహనాలను జూ పార్క్, మసీద్ అల్హా హొ అక్బర్ ఎదురుగా ఉన్న బహిరంగ ప్రదేశంలో పార్క్ చేయాల్సి ఉంటుంది. శివరాంపల్లి, దానమ్మ హట్స్ వైపు నుంచి వచ్చే వాహనాలు దానమ్మ హట్స్ చౌరస్తా నుంచి ఈద్గా వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. ఆంక్షలు అమలులో ఉన్న సమయంలో సాధారణ వాహనదారులకు ఈద్గా వైపు అనుమతి ఉండదు.
ఈ మార్గంలో వచ్చే వాహనాలను దానమ్మ క్రాస్ రోడ్స్ నుంచి శాస్త్రిపురం, ఎన్‌ఎస్ కుంట వైపు మళ్లిస్తారు. ఈ వాహనాలను మోడర్న్ సామిల్, ఈద్గా మైదాన్‌కు ఎదురుగా మెయిన్ రోడ్డు, మీరాలం ఫిల్టర్ బెడ్, దానికి ఆనుకుని ఉన్న ఖాళీ స్థలం, ఎదురుగా ఉన్న సూఫీ కార్స్, యాదవ్ పార్కింగ్ వద్ద పార్క్ చేయాలి.
కాలాపత్తార్ వైపు నుంచి ఈద్గాకు వెళ్లే వాహనాలను స్థానిక పోలీస్‌స్టేషన్ మీదుగా వెళ్లాలి. సాధారణ వాహనాలు పోలీస్ స్టేషేన్ వద్ద నుంచి మోచీ కాలనీ, బహదూర్‌పురా, షంషేర్‌గంజ్, ఎన్‌కే కుంట వైపు వెళ్లాల్సి ఉంటుంది. వాహనాలను భయ్యా పార్కింగ్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు వద్ద పార్క్ చేయాలి.

ఉదయం 8 నుంచి 11:30 గంటల వరకు పురానాపూల్ నుంచి బహదూర్‌పురా వైపు వచ్చే ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర భారీ వాహనాలను పురానాపూల్ దర్వాజా నుంచి జియాగూడ, సిటీ కాలేజ్ వైపు మళ్లిస్తారు. శంషాబాద్, రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి నుంచి బహదూర్‌పురా వైపు వెళ్లే భారీ వాహనాలను అరాంఘర్ చౌరస్తా వద్ద మళ్లిస్తారు.
హాకీ గ్రౌండ్, మాసబ్ ట్యాంక్ వద్ద రంజాన్ ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఫ్లై ఓవర్ కింద నుంచి వాహనాలు రాకపోకలు సాగించడానికి అనుమతి లేదు. మెహిదీపట్నం, లక్డీకాపూల్ వైపు నుంచి వచ్చే వాహనాలు ఫ్లై ఓవర్ పైనుంచి మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ ఉదయం 7 నుంచి 10 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి.
మెహిదీపట్నం నుంచి బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1 వైపు వచ్చే వాహనాలను మాసబ్‌ట్యాంక్ మీదుగా వెళ్లడానికి అనుమతి లేదు. ఈ వాహనాలు ఫ్లై ఓవర్ మీదుగా అయోధ్య జంక్షన్, ఖైరతాబాద్, తాజ్ కృష్ణ మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. లక్డీకాపూల్ నుంచి మాసబ్‌ట్యాంక్ మీదుగా వెళ్లే వాహనాలను అయోధ్య జంక్షన్ వద్ద ఖైరతాబాద్ వైపు మళ్లిస్తారు.
బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12, పంజాగుట్ట నుంచి మాసబ్‌ట్యాంక్ వైపు వాహనాలకు అనుమతి ఉండదు. వాహనాలను 1/12 జంక్షన్ నుంచి తాజ్ కృష్ణ మీదుగా ఖైరతాబాద్ వైపు మళ్లిస్తారు. వాహనదారులు ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటే 9010203626 ట్రాఫిక్ హెల్ప్ లైన్‌కు ఫోన్ చేయాలని కొత్తకోట శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications