ఆకాశ ప్రేమికులకు రేపు మూడు అద్భుతాలు.. ఆరుగ్రహాల ప్లానెట్ పరేడ్ తో ఇవి కూడా!
ఆగస్టు 12, 2026న ఆకాశ ప్రేమికులకు ఒకే రోజు మూడు అరుదైన ఖగోళ ఘట్టాలు కనువిందు చేయనున్నాయి. జీపీ బిర్లా అస్ట్రానమీ ప్రతినిధి మృణాళిని ఈ విషయాన్ని వెల్లడించారు. తెల్లవారుజామున ఆరు గ్రహాలు ఒకే వరుసలో కనిపించడం, పగటి పూట సంపూర్ణ సూర్యగ్రహణం, రాత్రి వేళ పెర్సీడ్ ఉల్కాపాతం గరిష్ఠ స్థాయికి చేరడం ఈ మూడు సంఘటనలు ఒకే రోజులో 24 గంటల్లో జరగడం చాలా అరుదుగా జరుగుతుందని ఆమె చెప్పారు.
రేపు ఆకాశంలో ఆరు గ్రహాల ప్లానెట్ పరేడ్
తెల్లవారుజామున జరిగే గ్రహాల అమరిక గురించి చెప్తూ బృహస్పతి, బుధుడు, కుజుడు, యురేనస్, శని, నెప్ట్యూన్ అనే ఆరు గ్రహాలు తూర్పు నుంచి పశ్చిమం వైపు ఒకేరేఖలో కనిపిస్తాయి. వీటిలో కుజుడు, శని కంటికి సులభంగా కనిపిస్తాయి. బృహస్పతి, బుధుడు కొంచెం కష్టంగానూ, యురేనస్, నెప్ట్యూన్‌ను చూడాలంటే టెలిస్కోప్ అవసరం అవుతుంది. సూర్యోదయానికి 45 నిమిషాల నుంచి గంట ముందు తూర్పు ఆకాశాన్ని చూస్తే ఈ ప్లానెట్ పరేడ్ స్పష్టంగా కనిపిస్తుంది.

రేపు సంపూర్ణ సూర్య గ్రహణం.. భారత్ లో కనిపించని గ్రహణం
హైదరాబాద్‌లో సూర్యోదయం సాధారణంగా ఉదయం 5:50-6:00 గంటల మధ్య జరుగుతుంది కాబట్టి ఉదయం 4:30 నుంచి 5:30 మధ్య మనం ఈ ప్లానెట్ పరేడ్ చూడవచ్చు. ఇక రేపే సంపూర్ణ సూర్యగ్రహణం. ఈ గ్రహణం గ్రీన్‌ల్యాండ్, ఐస్‌ల్యాండ్, స్పెయిన్, పోర్చుగల్, ఉత్తర రష్యా ప్రాంతాల్లో మాత్రమే సంపూర్ణంగా కనిపిస్తుంది. యూరప్, ఉత్తర అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో పాక్షిక గ్రహణం కనిపిస్తుంది. కానీ భారతదేశంలో ఈ గ్రహణం రాత్రి వేళ జరగడం వల్ల ఎక్కడా కనిపించదు.
పెర్సీడ్ ఉల్కాపాతం
భారత సమయం ప్రకారం రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజాము వరకు గ్రహణం జరుగుతున్నా మనం వీక్షించలేం. కాబట్టి సూతక కాలం వంటి నియమాలు కూడా వర్తించవు.మూడవ, అత్యంత ఆసక్తికరమైన ఘట్టం పెర్సీడ్ ఉల్కాపాతం. కామెట్ స్విఫ్ట్-టటిల్ మిగిల్చిన ధూళి కణాలు భూవాతావరణంలోకి ప్రవేశించి మండిపోవడం వల్ల ఈ ఉల్కలు కనిపిస్తాయి.ఆగస్టు 12 రాత్రి నుంచి 13 తెల్లవారుజాము వరకు గరిష్ఠ స్థాయికి చేరుతుంది.
హైదరాబాద్‌లో అర్ధరాత్రి దాటిన తర్వాత గంటకు 10 నుంచి 20 వరకు ఉల్కలు
అలాగే రాత్రి వేళ అద్భుతమైన ఉల్కాపాతం గరిష్ఠ స్థాయికి చేరడం జరగనున్నాయి. హైదరాబాద్‌లో అర్ధరాత్రి దాటిన తర్వాత గంటకు 10 నుంచి 20 వరకు ఉల్కలను స్పష్టంగా వీక్షించవచ్చని మృణాళిని పేర్కొన్నారు. ఉల్కలను చూడాలంటే నగరం నుంచి దూరంగా, చీకటి ప్రదేశంలో పడుకుని ఆకాశం వైపు చూడాలి. టెలిస్కోప్ అవసరం లేదు. కళ్లు చీకటికి అలవాటు పడేలా 15-20 నిమిషాలు వేచి ఉండాలి. ఈ మూడు ఘట్టాలు ఒకేసారి రావడం ఖగోళ ప్రేమికులకు ఒక గొప్ప అవకాశం.



Click it and Unblock the Notifications