యాదాద్రిలో రథసప్తమి వేడుకలు; స్వర్ణరథంపై ఊరేగనున్న స్వామి!!
మాఘమాసంలోని శుక్ల పక్షంలోని ఏడవ రోజు సప్తమి తిథిని రథ సప్తమిగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం రథసప్తమి ఫిబ్రవరి 16వ తేదీన వస్తుంది. రథసప్తమి పర్వదినాన శ్రీమహావిష్ణువుకు సంబంధించిన ప్రసిద్ధ ఆలయాలలో ఘనంగా వేడుకలు జరగనున్నాయి. ఇప్పటికే తిరుమల స్వామివారికి ఫిబ్రవరి 16వ తేదీన రథసప్తమి వేడుకలు నిర్వహిస్తుండగా, తెలంగాణ రాష్ట్రంలో కొలువుతీరిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో రథసప్తమి సందర్భంగా వేడుకలను నిర్వహించనున్నారు.
ఫిబ్రవరి 16వ తేదీన శుక్రవారం రథసప్తమి సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వేడుకలను ఘనంగా నిర్వహించటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రథ సప్తమి నాడు స్వామివారికి విశేష పూజలు నిర్వహించనున్నారు. రథ సప్తమి సందర్భంగా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారిని, అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకృతులను చేసి సూర్యప్రభ వాహనంపై ప్రత్యేక అలంకరణ చేసి, ఉదయం 6:40 నిమిషాలకు స్వామివారి ఆలయ తిరుమాడ వీధులలో ఊరేగింపు చేయనున్నారు.

ఆపై చతుర్వేద పారాయణం నిర్వహించనున్నారు. అంతేకాదు రథసప్తమి విశిష్టత భక్తులందరికీ విశదీకరించి చెప్పనున్నారు. అదే రోజు రాత్రి ఏడు గంటలకు శ్రీ నరసింహ స్వామి వారిని, అమ్మవారి సమేతంగా స్వర్ణ రథంపై ఆలయ తిరుమాడ వీధులలో ఊరేగింపు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ కార్యనిర్వహణాధికారి రామకృష్ణారావు ప్రకటన విడుదల చేస్తారు.
ఇదిలా ఉంటే నిన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థాన ఆదాయం 27 లక్షల 72 వేల618 రూపాయలుగా వెల్లడించారు. రథ సప్తమి నాడు ఆలయానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపధ్యంలో అందుకు కావాల్సిన ఏర్పాట్లను చేస్తున్నారు ఆలయ అధికారులు. కాగా రథసప్తమి నాడు తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వైష్ణవాలయాలలోనూ విశేష పూజలు కొనసాగుతాయి.
విష్ణు మూర్తి వివిధ రూపాలలో ఆయా ఆలయాలలో భక్తులకు దర్శనం ఇస్తారు. అంతేకాదు తెలంగాణా రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామంలో కొలువైన సూర్యభగవానుడి సన్నిధిలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఏటా మాఘశుద్ధ సప్తమి నాడు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications