పట్నం నరేందర్ రెడ్డికి మరో షాక్
బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన హౌజ్ మోషన్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. చర్లపల్లి జైలులో తనను ప్రత్యేక బ్యారక్‌లో ఉంచాలంటూ హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు నరేంద్ర రెడ్డి. ఆయన తరఫు న్యాయవాది ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రీకి పిటిషన్‌ను సమర్పించారు. నేరస్థులు ఉండే బ్యారక్‌లో పట్నం నరేందర్ రెడ్డిని ఉంచారంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు.
మాజీ ఎమ్మెల్యే అయిన పట్నం నరేందర్ రెడ్డిని ప్రత్యేక బ్యారక్‌లో ఉంచాలని ఆయన తరఫు న్యాయవాది హౌజ్ మోషన్ పిటిషన్‌లో కోరారు. అయితే, ఆ పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు రిజిస్ట్రీ తిరస్కరించారు. ప్రస్తుతం నరేందర్ రెడ్డి చర్లపల్లి జైలులో ఉన్న విషయం తెలిసిందే.

మరోవైపు, తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ లగచర్ల ఘటనలో ఏ1 నిందితుడిగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి గురువారం హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ప్రభుత్వ అధికారులపై దాడి కేసులో చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి.. తన న్యాయవాదుల ద్వారా కోర్టుకు అఫిడవిట్ పంపించారు.
'బుధవారం ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో నన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా కారులో ఎక్కించి వికారాబాద్ జిల్లా డీటీసీకి తీసుకెళ్లారు. ఆ సమయంలో పోలీసులు నా స్టేట్‌మెంట్ అసలు తీసుకోలేదు. కేవలం కోర్టులో హాజరుపరిచే 10 నిమిషాల ముందు కొన్ని పేపర్లపై నా సంతకాలు తీసుకున్నారు. నన్ను అక్రమంగా ఈ దాడి కేసులో ఇరికించారు' అని పట్నం నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.
'అరెస్టుకు ముందు నాకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ఇతర ముఖ్యనేతల అదేశాలతో దాడులు చేయించినట్లు పోలీసులు కట్టుకథ చెప్పారు. నేను పోలీసులకు ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వలేదు. రిమాండ్ నివేదికలో పోలీసులు చెప్పినవన్నీ నిజం కాదు. నా వాంగ్మూలాన్ని పరిగణనలోకి తీసుకొని విచారణ చేయాలి' అని కోర్టుకు పంపించిన అఫిడవిట్‌లో పట్నం నరేందర్ రెడ్డి వివరించారు. ఇది ఇలావుంటే, ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు వికారాబాద్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ జరగనుంది.












Click it and Unblock the Notifications