టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఊరట - కేంద్రం అనుమతి : రూ.4 వేల కోట్ల మేర..!!
ఆర్దికంగా తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. రెండు నెలలుగా ఆర్దికంగా కొంత ఇబ్బందులు పడుతున్న ప్రభత్వానికి ఉపశమనం దక్కింది. బహిరంగ మార్కెట్ నుంచి రూ.4,000 కోట్ల రుణ సేకరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. రుణాల రూపంలో వచ్చే వారం సమీకరించుకునే వెసులుబాటు ప్రభుత్వానికి కలిగించింది. 2022 -23 ఆర్దిక సంవత్సరానికి తొలి త్రైమాసికం లో రూ.11 వేల కోట్ల రుణాలు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది.
కానీ, ఎఫ్‌ఆర్‌బీఎం నూతన నిబంధనల పేరుతో కేంద్రం గత రెండు నెలలూ అనుమతి ఇవ్వలేదు. దీని పైన రాజకీయంగానూ ఆరోపణలు - విమర్శలు మొదలయ్యాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని తాత్కాలిక విధానం ద్వారా రుణం పొందేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది.

రూ 4 వేల కోట్ల రుణానికి అనుమతి
దీంతో 13 ఏళ్ల కాలపరిమితితో మంగళవారం బాండ్ల వేలానికి ఆర్‌బీఐ నోటిఫికేషన్ జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ వెలుపల కార్పొరేషన్లు, సంస్థల ద్వారా తీసుకునే రుణాలను సైతం ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి తీసుకొస్తామని చెబుతూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది. గత రెండేల్ల కాలంలో తీసుకున్న రుణాలను ఇందులో కలిపి..ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని నిర్దేశిస్తామని కేంద్రం చెప్పటం పైన పలు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేసాయి.
తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆ రుణాలపైన పూర్తి సమాచారం ఇవ్వాలని కేంద్రం కోరింది. ఆ లెక్కలు తేలే వరకూ బహిరంగ మార్కెట్ నుంచి రుణాల సేకరణను నిలిపి వేసింది. దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం..పాత విధానం కొనసగించాలని కోరింది.

తెలంగాణ - కేంద్ర ప్రభుత్వాల మధ్య
దీని పైన కేంద్రానికి లేఖలు రాసింది. రాష్ట్ర ప్రభుత్వంలోని ఆర్దిక శాఖ అధికారులు కేంద్ర ఆర్దిక శాఖ ఉన్నతాధిరులతో పలు దఫాలు భేటీ అయ్యారు. రుణాలకు అనుమతివ్వాలని కోరారు. కానీ, కేంద్రం తన నిర్ణయం మార్చుకోలేదు. కానీ, ఇప్పుడు తాత్కాలిక పద్దతిన మాత్రమే రుణ సేకరణకు కేంద్రం అనుమతి ఇచ్చింది.
ఇందులో భాగంగా ఏ అంశాల ప్రాతిపదికన ఇందులకు అనుమతి ఇచ్చింది.. ఎంత మేర ఈ పరిమితి ఉంటుందనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే, రాష్ట్రంలో ప్రస్తుతం ఆదాయం..వ్యయం మధ్య అంతరం ఉంది. వేతనాలు, పింఛన్లు, రాయితీలు, వడ్డీల చెల్లింపు, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుకు నిధుల సర్దబాటుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ప్రభుత్వానికి తాత్కాలిక ఉపశమనం
ఇక, ఇదే సమయంలో ఈ నెలలోనే ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం రైతు బందు కింద రూ 7 వేల కోట్లకు పైగా చెల్లింపులు చేయాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఇచ్చిన తాత్కాలిక అనుమతి కొంత మేర రాష్ట్ర ప్రభుత్వానికి ఉపశమనంగా కనిపిస్తోంది. ఇక, ఈ ఆర్థిక సంవత్సరంలో అప్పుగా తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిన మొత్తం, విధివిధానాలు మాత్రం ఇంకా తేలలేదు. త్వరలోనే ఇందుకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications