చంద్రబాబు అరెస్టును గుర్తుచేసి.. కవిత అరెస్ట్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటువ్యాఖ్యలు!!
బిఆరెస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట కవిత అరెస్టును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి . రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించి నిరసనను వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
నేడు కవిత కోసం జరుగుతున్న ఆందోళనలపై స్పందించిన ఆయన అసలు ఢిల్లీ లిక్కర్ కేసుకు తెలంగాణ రాష్ట్రానికి ఏమిటి సంబంధం అంటూ ప్రశ్నించారు. కవితను అరెస్టు చేసింది ఢిల్లీ పోలీసులు అయితే తెలంగాణలో ధర్నాలు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టడం దేనికని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు.

నాడు చంద్రబాబు అరెస్టు సందర్భంగా హైదరాబాద్ కేంద్రంగా ధర్నాలు, ఆందోళనలు చేస్తే అడ్డుకున్న వ్యక్తులు, ఇవాళ ధర్నాలకు పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. ఢిల్లీకి చెందిన ఈడి అధికారులు కవితను అరెస్ట్ చేస్తే తెలంగాణలో ఆందోళనలు దేనికని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన విషయాలకు హైదరాబాద్లో ధర్నాలు ఎందుకని నాడు బి ఆర్ ఎస్ నేతలు ప్రశ్నించిన విషయాలను గుర్తు చేశారు.
అంతేకాదు ప్రాజెక్టుల నిర్మాణంలో అక్రమంగా సంపాదించిన డబ్బుతో స్పెషల్ ఫ్లైట్లు బుక్ చేసుకొని బీఆర్ఎస్ కార్యకర్తలను ఢిల్లీకి తీసుకుపోయి ఈడి ఆఫీస్ ముందు ధర్నాలు చేసుకోమంటూ హితవు పలికారు. నాడు ఎవడు వస్తాడో రావాలని.. తొడగొట్టి సవాల్ చేసిన నేతలు నేడు సామాన్య కార్యకర్తలను ఎందుకు రోడ్లమీద తెస్తున్నారని ప్రశ్నించారు.
మీ లిక్కర్ రాజకీయాలకు రాష్ట్రాన్ని రావణ కష్టంగా మార్చాలి అనుకుంటున్నారా అంటూ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా బ్రతకాలి అనుకుంటున్నారని, ఇలాంటి సమయంలో మీ కుటుంబ రాజకీయాలతో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి తో కుమ్మక్కై మీరు రాయలసీమకు నీళ్లు ఇవ్వడం వల్ల ప్రస్తుతం తెలంగాణలో నీళ్లు లేని దుస్థితి వచ్చిందని, రైతులు కరువుతో అల్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications