ఆంక్షలు షురూ.!తెలంగాణలో మళ్ళీ కంటైన్మెంట్ జోన్లు.!అప్రమత్తమైన యంత్రాంగం.!
హైదరాబాద్ : ఒమిక్రాన్ వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్నట్టే భారతదేశాన్ని గడగడలాడిస్తోంది. అందులో భాగంగా తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. ఒమిక్రాన్ సంక్రమించిన తర్వాత ఆసుపత్రుల్లో సౌకర్యాల అంశం తర్వాత గానీ ముందుగా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆంక్షలను అమలు చేస్తున్నారు. కరోనా రెండవ దశ తర్వాత రాష్టంతో పాటు హైదరాబాద్ నగరంలో తొలిసారి కంటెయిన్మెంట్ ప్రాంతాలను గుర్తించింది ప్రభుత్వం.

నగరంలో తొలి కంటైన్మెంట్ జోన్.. ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా కట్టదిట్టమైన చర్యలు
నగరంలో మళ్లీ కంటైన్మెంట్ జోన్లు మొదలయ్యాయి. హైదరాబాద్ నగరంలో ఒమిక్రాన్ కేసులు గుర్తించిన నేపథ్యంలో టోలీచౌక్ మొత్తం ఒక క్లస్టర్‌గా నిర్బంధం చేశారు. కేసులు నమోదైన పారమౌంట్ కాలనీని పోలీసులు, వైద్య సిబ్బంది జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే ఆ ఇద్దరి కుటుంబ సభ్యులకు కరోనా టెస్టులు చేసి జీనోమ్ సీక్వెన్సింగ్‌కు కూడా శాంపిల్స్ పంపించినట్లు వైద్యాధికారులు తెలిపారు. అయితే ఇక నుంచి విదేశాల నుంచి వచ్చిన వారిలో ఒక్కరికి పాజిటివ్ తేలినా, ఆ కుటుంబ సభ్యులందరినీ క్వారంటైన్ చేసి టెస్టులు చేయనున్నట్టు అధికారులు స్పష్టం చేసారు.

అలర్ట్ ఐన యంత్రాంగం.. సందేహం ఉన్న కాలనీలపై ఆంక్షలు
మొదటి, రెండో వేవ్ లో చేసినట్లే ఈ కంటైన్ మెంట్ ప్రక్రియ ఉండనుంది. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్ విధానం మళ్లీ అమల్లోకి రానుంది. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతంలో కేసులు పెరిగినా క్లస్టర్లుగా విభజించిన సదరు కాలనీల్లో ప్రతి రోజు హైపోక్లోరైట్ ద్రావణాన్ని స్ప్రే చేయనున్నారు. ఎప్పటికప్పుడు వైద్య సిబ్బంది , మున్సిపల్, పంచాయతీ, రెవెన్యూ, పోలీస్సిబ్బందిలు ఆ ఏరియాను పర్యవేక్షణ చేయనున్నారు. కంటైన్మెంట్ లో ఉన్న వ్యక్తి బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.

అత్యవసర వస్తువులను జీహెచ్ఎంసీ అందజేత.. ఇతరులకు సోకకుండా కఠిన చర్యలు
అవసరమైన నిత్యావసర, అత్యవసర వస్తువులను జీహెచ్ఎంసీ సిబ్బంది అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరో 8 వారాల పాటు అప్రమత్తంగా ఉండాల్సిందేనని వైద్యశాఖ నొక్కి చెప్పింది. కంటైన్మెంట్లు విధించడం వలన వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేయొచ్చని చెప్పుకొస్తున్నారు. వైరస్ చైన్ లింక్ ను తొలగించే ప్రక్రియనే ఈ క్లస్టర్ విధానం. ఈ పరిధిలో ఒక వ్యక్తి మరో వ్యక్తిని కలిసే అవకాశం లేనందున వైరస్ కేవలం కంటైన్మెంట్కే పరిమితం అవుతుంది. ఇంక్యూబేషన్ పీరియడ్ తర్వాత పూర్తిస్థాయి అదుపులోకి వస్తుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా కంటైన్మెంట్ ప్రక్రియ.. తెలంగాణలో తొలిసారి ప్రారంభం
తద్వారా కేసుల తీవ్రతను సులువుగా అడ్డుకోవచ్చని అధికారులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మొదటి, రెండో వేవ్‌లలో వైరస్ వ్యాప్తిని ఈ విధానంతోనే అడ్డుకున్నట్లు అధికారులు చెప్పారు. అసలు దేశవ్యాప్తంగా కంటైన్మెంట్ ప్రక్రియను మన రాష్ట్రంలోనే తొలిసారిగా అమలు చేసినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. మొదటి వేవ్ సమయంలో మర్కజ్ వ్యక్తులను గాలింపు చర్యల్లో కరీంనగర్లో మొదటి సారి కంటైన్మెంట్ చేశారు. ఆ తర్వాత కేసులు ఎక్కువగా ఉన్న ప్రతి ప్రాంతంలో ఈ ప్రక్రియను తీసుకువచ్చారు.












Click it and Unblock the Notifications