ముగ్గురు అనాథ తోబుట్టువులను ఒక్కచోట చేర్చిన సైన్స్ ఫేర్ ఫోటో...
ఓ సైన్స్ ఫేర్ ముగ్గురు అనాథ అక్కాచెల్లెళ్లను ఒక్కచోటుకు చేర్చింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో ముగ్గురిలో ఇద్దరిని బంధువులు అనాథాశ్రమంలో చేర్చారు. నానమ్మ,తాతయ్యల వద్ద వున్న చిన్న చెల్లెలు.. వారి మరణానంతరం ఆలనా పాలనా లేక వీధుల్లో భిక్షాటన చేసింది. చివరకు ఆ చిన్నారి కూడా తన అక్కలు ఉంటున్న అనాథాశ్రమానికే చేరినప్పటికీ... వారు ఉండేది అక్కడే అనే విషయం ఆమెకు తెలియదు. తమ చెల్లెలు అక్కడే ఉంటుందన్న విషయం అక్కలకు కూడా తెలియదు. అనూహ్యంగా ఇటీవల నిర్వహించిన సైన్స్ ఫేర్‌కి సంబంధించిన ఓ ఫోటో ఆ ముగ్గురినీ ఒక్క చోటుకి చేర్చింది.
వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్‌లోని ఓ ప్రాంతంలో నివసించే ఓ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో పెద్దమ్మాయి వయసు 14 ఏళ్లుగా,రెండో అమ్మాయి వయసు 12 ఏళ్లు,చిన్నమ్మాయి వయసు పదేళ్ల కన్నా తక్కువే. చిన్నతనంలోనే తల్లి చనిపోగా... మూడేళ్ల క్రితం తండ్రి చనిపోయాడు. దీంతో బంధువులు ముగ్గురిలో ఇద్దరు బాలికలను అనాథాశ్రమంలో చేర్చారు.మూడో బాలిక నానమ్మ,తాతయ్యల ఇంటి వద్ద ఉంటోంది.

ఇదే క్రమంలో కొద్దిరోజుల క్రితం నానమ్మ,తాతయ్య చనిపోవడంతో ఆ బాలిక ఆలనా పాలనా చూసేవారు కరువయ్యారు. దీంతో కొద్దిరోజులు వీధుల్లోనే ఆ బాలిక భిక్షాటన చేసింది. చివరకు,బాలిక అక్కలను చేర్చిన అనాథాశ్రయ నిర్వాహకులే ఆమెనూ చేరదీశారు. అయితే ఆమెను వేరే బ్రాంచ్‌లో చేర్చారు. ఈ విషయం ఆ బాలిక అక్కాచెల్లెళ్లకు తెలియదు. అదే అనాథాశ్రమానికి చెందిన బ్రాంచ్‌లో తన అక్కలు ఉంటున్నారనే విషయం ఆ బాలికకు కూడా తెలియదు.
ఈ క్రమంలో ఇటీవల ఆ అనాథాశ్రమం సైన్స్ ఫేర్ నిర్వహించగా... అందులో ఓ ఫోటో ఆ అక్కాచెల్లెళ్ల కంటపడింది. అందులో తమ చెల్లెలిని గుర్తించారు. దీనిపై అధికారులకు సమాచారం అందించగా... ముగ్గురు బాలికలకు డీఎన్ఏ టెస్టులు చేశారు. ముగ్గురు తోబుట్టువులేనని తేల్చారు. ఎట్టకేలకు ముగ్గురినీ ఒక్కచోట చేర్చారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన అక్కాచెల్లెళ్లు ఒక్కచోటకి చేరడంతో సంతోషం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ జిల్లాకు చెందిన సంక్షేమ అధికారి అకేశ్వర్ మాట్లాడుతూ... రాష్ట్రంలోని పలు అనాథాశ్రమాల్లో విద్యార్థులను ప్రోత్సహించేందుకు అధికారులు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగా సైన్స్ ఫేర్ నిర్వహించగా... అందులో ఒక ఫోటో ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లను ఒక్క చోట చేర్చిందన్నారు. తల్లిదండ్రులను కోల్పోయినా తోబుట్టువులంతా ఒకచోటుకు చేరినందుకు వారు సంతోషంగా ఉన్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications