బీఆర్ఎస్ కు భారీ షాక్ - కాంగ్రెస్ కు కలిసొచ్చేనా, కీలక మలుపు..!!
తెలంగాణ ఎన్నికల కీలక సమయంలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. రైతుబంధు పంపిణీకి అనుమతి దక్కడంతో సద్వినియోగం చేసుకోవచ్చని భావించిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా నగదు పంపిణీ అనుమతిని ఎన్నికల సంఘం రద్దు చేసింది. దీంతో, ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో రేవంత్ రంగంలోకి దిగారు. కీలక వ్యాఖ్యలు చేసారు.
ఈసీ కీలక నిర్ణయం: తెలంగాణలో రైతు బంధు పంపిణీ పైన ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఈసీ వెనక్కి తీసుకుంది. ఏటా యాసంగి రైతుబంధును నవంబరు, డిసెంబరుల్లోనే పంపిణీ చేస్తున్నారు. ఈ సారి నవంబరు ముగుస్తున్నా, సీజన్ ముంచుకొస్తున్నా నగదు సాయంపై స్పష్టత లేకపోవడంతో పెట్టుబడికి ఇబ్బంది తలెత్తుతుందని రైతులు కలత చెందారు.

ఈ నేపథ్యంలో సీఈసీ కనికరించింది. రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లుగా ఈ నెల 24 నుంచి రైతుబంధు పంపిణీ చేయొచ్చంటూ అనుమతిచ్చింది. నగదు సాయానికి అనుమతి ఇస్తూనే సీఈసీ షరతులు విధించింది. ఎన్నికల ప్రచారం ముగిశాక పంపిణీ చేయొద్దని స్పష్టం చేసింది.
హరీష్ వ్యాఖ్యలతో: ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందు అంటే, ఈ నెల 28తో ప్రచార ఘట్టం ముగుస్తుంది. అంటే ఇవాళ మాత్రమే రైతుబంధు పంపిణీకి ప్రభుత్వానికి అనుమతి ఉంది. ఈలోపే రైతుబంధు పంపిణీకి ఈసీ అనుమతి నిరాకరించింది. ఈ నెల 25, 26, 27 తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
29, 30 తేదీల్లో పంపిణీకి అనుమతి లేదని వివరించింది. దీనికి తగినట్లు రైతుబంధును డీబీటీ పద్ధతిలో జమచేస్తామని తెలిపింది. దీనికి సంబందించి 28న రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రైతు బంధు నిధులపై హరీష్ చేసిన వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని చెబుతూ ఎన్నికల సంఘం గతంలో ఇచ్చిన అనుమతి రద్దు చేసింది. ఇది పోలింగ్ కు ముందు బీఆర్ఎస్ కు ఊహించని పరిణామంగా మారుతోంది.

రేవంత్ హామీ: దీని పైన టీపీసీసీ చీఫ్ రేవంత్ స్పందించారు. రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప.. మిగతా రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశం మామా-అల్లుళ్లకు లేదన్నారు. హరీశ్ వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్లు ఈసీ ఆదేశాలు ఇవ్వడం దీనికి నిదర్శనంగా పేర్కొన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని చెప్పారు.
పది రోజుల్లో కాంగ్రెస్ రాగానే రూ.15వేలు రైతు భరోసా మీ ఖాతాల్లో వేస్తాం..అంటూ ట్వీట్ చేశారు. పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న వేళ..ఇప్పుడు రైతు బంధు అంశం కీలకంగా మారుతోంది. దీని పైన ఎలాంటి ప్రభావం ఎన్నికల్లో ఉంటుందనేది ఉత్కంఠ పెంచుతోంది.
రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప, నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్ధేశం మామా - అల్లుళ్లకు లేదు.
— Revanth Reddy (@revanth_anumula) November 27, 2023
హరీష్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు ఈసీ ఆదేశాలు ఇవ్వడం దీనికి నిదర్శనం.
ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు… pic.twitter.com/H56vhAiNlk












Click it and Unblock the Notifications