కెసిఆర్ కుట్ర, ఒక సామాజికవర్గంపై దాడులు: రేవంత్ సంచలన ఆరోపణ
మహబూబ్ నగర్: తెలంగాణలో దొరలు అందరు కలిసి కుట్రలు చేస్తూ ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతల పైన దాడులు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ యువనేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి శనివారం మండిపడ్డారు.
మహబూబ్ నగర్ పట్టణంలో జిల్లా పరిషత్ సమావేశాల సందర్భంగా జరిగిన గొడవలు, తెరాస ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేపై చేయి చేసుకున్నారన్న ఆరోపణలపై స్పందించారు.
ఒకే సామాజిక వర్గంపై దాడులు జరుగుతున్నాయని కులం పేరు చెప్పకుండానే 'రెడ్డి' వర్గాన్ని ఆయన ప్రస్తావించారు. కేసీఆర్ నియంతలా పాలన సాగిస్తున్నాడన్నారు. ఆయన్ను ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు ఐకమత్యంతో కలసి నడవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలో ఒక సామాజిక వర్గీయులను రాజకీయాలకు దూరం చేయాలనే లక్ష్యంతో కెసిఆర్, మంత్రి హరీష్ రావులు దాడులను ప్రోత్సహిస్తున్నారన్నారు. ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే పార్టీలకు అతీతంగా టిఆర్ఎస్ పైన పోరాటానికి సిద్ధం కావాలన్నారు.

కెసిఆర్, మంత్రులు హరీష్ రావు, జూపల్లి కృష్ణా రావులు ఒక సామాజిక వర్గ శాసన సభ్యులే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. మహిళ అని కూడా చూడకుండా శాసన సభలో డికె అరుణను అవమానపరిచారన్నారు. వనపర్తిలో చిన్నారెడ్డి, తాజాగా పాలమూరులో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పైన దాడులు పథకం ప్రకారమే జరిగాయన్నారు.
జడ్పీ సమావేశాల్లో నారాయణ పేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పైన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీపూలు దాడికి పథకం రూపొందించారని, ఆయన బయటకు వెళ్లిపోవడంతో రామ్మోనహ్ రెడ్డి పైన దృష్టి పెట్టి దాడికి పాల్పడ్డారని రేవంత్ రెడ్డిఆరోపించారు.
దాడులను అరికట్టేందుకు కాంగ్రెస్ పార్టీ టిడిపితో కలిసి పోరాటానికి కలిసి రావాలన్నారు. రాష్ట్రంలో కరవు నేపథ్యంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.












Click it and Unblock the Notifications