రేవంత్ అరెస్టు: టి టిడిపి భవిష్యత్తుపై నీలినీడలు
హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి అరెస్టు కావడం తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. దానికితోడు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో చావు దెబ్బ తినడం కూడా ఆ పార్టీ భవిష్యత్తుపై నీలినీడలు అలుముకున్నాయి. ఇప్పటికే తెలంగాణలో తిరిగి బలం పుంజుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు అంతగా ఫలించక విలవిలలాడుతున్న టిడిపికి ఈ రెండు ఉదంతాలు తీవ్రమైన నష్టం కలిగించాయి.
రేవంత్ రెడ్డి ఉదంతంతో తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకుల్లో నైతిక స్థయిర్యం కొరవడినట్లు పరిస్థితి కనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదుగురు బిజెపి సభ్యులు వోట్లు చెల్లకపోవడంపై నిందను కూడా టిడిపియే మోస్తోంది. మొదటి ప్రాధాన్య ఓటను టిడిపికి వేసిన బిజెపి సభ్యులు రెండో ప్రాధాన్య ఓటును నోటాకు వేశారు. దీంతో ఆ ఓట్లు చెల్లకుండా పోయాయి.
అందులో బిజెపి వ్యూహం మాట ఎలా ఉన్నా, తెలుగుదేశం పార్టీ చెప్పడం వల్లనే తాము ఆ విధంగా ఓటేశామని బిజెపి నాయకులు చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి నాయకులు సమగ్రమైన అవగాహనతో ముందస్తు కసరత్తు చేయలేదని ఆ ఉదంతం తెలియజేస్తోంది.
ఇప్పటికే పలువురు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చేరారు. ఈ వలసలను తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రస్తావిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొంటున్నారని వ్యాఖ్యానిస్తూ వచ్చారు. టిడిపి అధినేత చంద్రబాబు కూడా పలు సందర్భాల్లో అ వ్యాఖ్య చేశారు. ఇప్పుడు ఆ విషయంలో కెసిఆర్‌ను తప్పు పట్టడానికి వీలు లేనంతగా టిడిపి చిక్కుల్లో పడింది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ ఎమ్మెల్యేను కొనడానికి డీల్ నడిపి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడడంతో కెసిఆర్‌పై అటువంటి ఆరోపణలు చేయడానికి నైతికంగా టిడిపి నాయకులు బలాన్ని కోల్పోయారు. రేవంత్ రెడ్డిని కుట్రలో భాగంగా ఇరికించారనే విమర్సలు కూడా అంతగా టిడిపికి ఉపయోగపడేవి కావు. ఒక వేళ కెసిఆర్ కుట్రలో భాగంగానే రేవంత్ రెడ్డి అరెస్టు అయినా, రేవంత్ రెడ్డిని కుట్రపూరితంగా ట్రాప్ చేశారని విమర్శించినా రేవంత్ రెడ్డి చేసిన వ్యవహారమే ముఖ్యమైన చర్చనీయాంశంగా మారుతుంది.
దానికితోడు, తెలుగుదేశం తెలంగాణ నాయకుల్లో ఐక్యత కొరవడిన విషయం, సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తున్నాయి. పార్టీని ఏకతాటిపై నడిపే నాయకులు టిడిపి తెలంగాణలో లేకుండా పోయారు. తెలంగాణలో పార్టీని తన చేతుల్లోకి తీసుకుందామని తీవ్రంగా ప్రయత్నించి, దూకుడుగా వ్యవహరించిన రేవంత్ రెడ్డి తన భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేసుకున్నారు.
మరోవైపు, తెలంగాణలో బిసిలను ఆకట్టుకోవడానికి ఆర్. కృష్ణయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన గెలిచిన తర్వాత పార్టీలో ఆయన స్థానం ప్రశ్నార్థకంగా మారింది. ఆయనను కలుపుకుని ముందుకు వెళ్లడానికి తెలుగుదేశం నాయకులు అంత ఇష్టంగా లేరు. దాంతో కృష్ణయ్య టిడిపి శాసనసభ్యుడే అయినప్పటికీ ఒంటరిగా పక్షి అయ్యారు. దాంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురై టిడిపి పట్ల అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ స్థితిలో టిడిపి తెలంగాణలో తిరిగి బలం పుంజుకునే పరిస్థితులు పూర్తిగా కొరవడ్డాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications