రూ.500 కే గ్యాస్ సిలెండర్ పై రేవంత్ సర్కార్ జీవో జారీ- మెలిక ఇదే..!
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మరో గ్యారంటీ అమలుకు సిద్ధమైంది. ఆరు గ్యారంటీల్లో భాగమైన మహాలక్ష్మి పథకంలోని రూ.500 కే గ్యాస్ సిలెండర్ హామీని అమలు చేసేందుకు ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం అమలుకు అర్హత, షరతులు ఇతర వివరాలతో జీవో విడుదల చేసింది. దీని ప్రకారం రూ.500 కే గ్యాస్ సిలెండర్ పొందాలంటే రేషన్ కార్డును తప్పనిసరి చేశారు.

తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రూ.500 కే పేదలకు గ్యాస్ సిలెండర్ హామీ ఇచ్చింది. దీని అమలుపై విపక్షాల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రూ.500కే సబ్సిడీపై గ్యాస్ సిలెండర్ ఇచ్చేందుకు వీలుగా మార్గదర్శకాలతో ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. ఇందులో రాష్ట్రంలోని బీపీఎల్ కుటుంబాలకు అంటే రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు మాత్రమే దీన్ని పరిమితం చేసి అమలు చేయనున్నట్లు తెలిపారు.
ఈ లెక్కన రాష్ట్రంలో ఉన్న 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లలో 89.99 లక్షల మంది రేషన్ కార్డు దారులకు మాత్రమే ఈ రూ.500 గ్యాస్ సిలెండర్ పథకం వర్తించబోతోంది. ఇప్పటికే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఈ పథకం వర్తింపచేస్తారు. రూ.500 కే గ్యాస్ సిలెండర్ ఇవ్వడం వల్ల గ్యాస్ కంపెనీలపై పడుతున్న అదనపు భారాన్ని నెలవారీగా రీయింబర్స్ మెంట్ చేస్తామని ప్రభుత్వం ఇవాళ విడుదల చేసిన జీవోలో తెలిపింది. ఇక్కడే ఓ మెలిక ఉంది.
రేషన్ కార్డు ఉండి ప్రజాపాలనలో రూ.500 గ్యాస్ సిలెండర్ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారు సాధారణ రేటుకు సిలెండర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సిలెండర్ డెలివరీ తర్వాత గ్యాస్ కంపెనీలు ఇందులో రూ.500 కంటే ఎక్కువగా ఉన్న రాయితీ మొత్తాన్ని వినియోగదారుల ఖాతాల్లోకి బదిలీ చేస్తాయి. అలాగే మూడేళ్ల సగటు వినియోగం ఆధారంగానే ఈ సిలెండర్లను వినియోగదారులకు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం జీవోలో వెల్లడించింది.












Click it and Unblock the Notifications