తెలంగాణలోనూ వాలంటీర్ల వ్యవస్థ, తాజా కసరత్తు వెనుక..!!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఏపీలో అధికారంలో ఉన్న సమయంలో మాజీ సీఎం జగన్ ప్రవేశ పెట్టిన విధానం తెలంగాణలో ఇప్పుడు అమలు చేసే విధంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ అమలు చేసిన ఈ విధానంకు ప్రజల నుంచి మద్దతు వచ్చినా.. రాజకీయంగా నష్టం చేసిందనే అభిప్రాయం ఉంది. దీంతో.. తరువాత వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ విధానం పక్కన పెట్టింది. కాగా.. ఇప్పుడు రేవంత్ తెలంగాణలో ఇదే ఫార్ములా అమలు దిశగా కసరత్తు చేస్తున్నారనే సమాచారం ఆసక్తిగా మారుతోంది.
ముఖ్యమంత్రి రేవంత్ తెలంగాణలో వాలంటీర్ల విధానం తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు పార్టీ ముఖ్య నేతల సమాచారం. ప్రభుత్వ సంక్షేమ పథకాలను గడపగడపకూ చేర్చేందుకు, ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి ఈ వాలంటీర్ వ్యవస్థను సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లు చెబుతున్నారు. దాదాపు లక్ష మందితో నూతన వలంటీర్ల వ్యవస్థను తీసుకురావడానికి కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు.

సంక్రాంతి తరువాత సీఎం రేవంత్ ప్రజాబలం పేరుతో ప్రతీ గ్రామంలో పర్యటించేలా ప్లాన్ సిద్దం చేస్తున్నారు. ఈ క్రమంలో సంక్షేమ పథకాల అమలు కోసం ప్రత్యేక యంత్రాంగం అవసరమని గుర్తించి.. ఇందు కోసం వాలంటీర్ విధానం అమలుకు సిద్దం అయ్యారనే ప్రచారం సాగుతోంది. వీరికి నాడు ఏపీలో ఇచ్చిన విధంగానే గౌరవ వేతనం ఇవ్వటం ద్వారా వారి సేవలను ప్రతీ గడపకు వినియోగించే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే, ఏపీలో జగన్ అధికారంలో ఉన్న సమయంలో తీసుకొచ్చిన ఈ వాలంటీర్ విధానం ద్వారా కరోనా సమయంలో అందించిన సేవలకు అందరి ప్రశంసలు అందాయి. ప్రభుత్వ పథకాలు, సేవలు కార్యాలయాలకు వెళ్లే అవసరం లేకుండానే ఇంటి వద్దనే ఈ వాలంటీర్ల ద్వారా సాధారణ ప్రజలకు అందాయి. అయితే, 2024 ఎన్నికల్లో జగన్ ఓటమికి కారణాల్లో వాలంటీర్ విధానం పైనా చర్చ జరిగింది. వైసీపీ సొంత నేతలే వాలంటీర్ల వ్యవస్థ కారణంగా ప్రజలతో నేతలకు సంబంధాల విషయంలో నష్టం జరిగిందని వాపోయారు.
దీంతో.. తాము అధికారంలోకి వస్తే రూ 10 వేలు గౌరవ వేతనం ఇస్తామని చెప్పిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్ విధానం పక్కన పెట్టారు. దీంతో.. సీఎం రేవంత్ ఈ విధానం అమలు ద్వారా లాభ - నష్టాల పైన పూర్తి సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. వీటిని పరిశీలన చేసిన తరువాత తుది నిర్ణయం ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో.. తుది నిర్ణయం పైన ఉత్కంఠ నెలకొంది.














Click it and Unblock the Notifications
