కేసీఆర్ వేల కోట్లు వెనకేశారు: టిఆర్ఎస్‌పై రేవంత్ వివాదాస్పద వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్)పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్)పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. టిఆర్ఎస్ పార్టీ కలిస్తే ఐఎస్ఐ ఏజెంట్లతో కలిసినట్లేనంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడానికి కుట్రలు చేసే ఐఎస్ఐతో కలిసి పనిచేయడం, తెలంగాణ ప్రజల జీవన విధ్వంసానికి పాల్పడుతున్న సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేయడం ఒక్కటేనని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో అసలైన ఉద్యమకారులు ఆస్తులు, ప్రాణాలను, ఉద్యోగాలను పోగొట్టుకుంటే.. కేసీఆర్ మాత్రం మీడియా హౌజులు, ఫాంహౌజులు పెట్టుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించున్నారని రేవంత్ ఆరోపించారు.
ఎన్నికల సమయంలో అలవికాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. తెలంగాణకు పట్టిన చీడ పురుగని విమర్శించారు. దొరలకు, దొర గడీలకు వ్యతిరేకంగా అణగారిన వర్గాల పక్షాన ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ.. అదే లక్ష్యంతో ముందుకు సాగుతుందని రేవంత్ స్పష్టం చేశారు.

దివాళాకోరు రాజకీయాలు
వైయస్సార్ కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు చీకటి మిత్రులుగా దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నాయని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ ఆరోపించారు. రానున్న 2019 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు తెరమరుగవడం ఖాయమని అన్నారు. టిఆర్‌ఎస్‌తో పొత్తుకు టి-దేశం సందేశం అంటూ వచ్చిన వదంతులను రమణ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.
టిఆర్ఎస్ సర్కార్ వైసీపీతో జత కట్టి.. వైసీపీ ఆంధ్రా ఎంపీలకు తెలంగాణ ప్రాజెక్టుల్లో కాంట్రాక్టులు కట్టబెట్టి తెలంగాణ ప్రజల సొమ్మును దోచిపెడుతున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఒక వైపు తెలంగాణలో టిడిపిని బలహీనపర్చాలని టిఆర్ఎస్, వైసీపీలు ప్రయత్నించి.. మరో వైపు ఎపీలో వైసీపీ తన ఉనికిని కోల్పోతోందని అన్నారు. తెలంగాణకు పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దుతో నిజమైన స్వాతంత్య్రం తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని అన్నారు.












Click it and Unblock the Notifications