రేవంత్ రెడ్డి కేసీఆర్‌కు రెండో కొడుకు-2023లో విజయ్ మాల్యాలా కేటీఆర్ విదేశాలకు పారిపోతారు-ఎంపీ అరవింద్ సంచలనం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీ పాదాలు కడిగి... ఆ నీళ్లు నెత్తిపై చల్లుకోవాలని ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. కేసీఆర్ మోదీ వద్దకు వెళ్లి సోషల్ ఇంజనీరింగ్ నేర్చుకోవాలన్నారు. మోదీ కేబినెట్‌లో 12 మంది ఎస్సీలు,27 మంది బీసీలు,8 మంది ఎస్టీలు ఉన్నారని తెలిపారు. కానీ కేసీఆర్ కేబినెట్‌లో ఒక్కరే దళిత మంత్రి,ఒక్కరే ఎస్టీ మంత్రి ఉన్నారని అన్నారు. మిగతా మంత్రుల్లో 11 మంది దొరలే ఉన్నారని విమర్శించారు. ఇదెక్కడి సామాజిక న్యాయమని ప్రశ్నించారు. జనాభా పరంగా అత్యధిక సంఖ్యలో ఉండి కూడా దళితులకు రాజ్యాధికారం లేదని కేసీఆర్ మాట్లాడుతున్నారని... మరి దళిత ముఖ్యమంత్రి హామీని ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు.

దుబ్బాక డైలాగులే హుజురాబాద్‌లో రిపీట్ : ఎంపీ అరవింద్
రాష్ట్రంలో 24 గంటల ఉచిత్ విద్యుత్ అందిస్తున్నామని చెబుతున్న కేసీఆర్... ఇప్పటివరకూ కొత్తగా ఒక్క యూనిట్ విద్యుత్‌ను కూడా సృష్టించలేదన్నారు. పైగా రూ.1లక్షా 15వేల కోట్ల కరెంట్ బకాయిలు ఉన్నాయన్నారు. మిషన్ భగీరథ పేరుతో రూ.50వేల కోట్లు ఖర్చు పెట్టి అందులో సగం కమిషన్ల పేరుతో మింగేశారని ఆరోపించారు. ఇంటింటికి నల్లా నీళ్లు అందిస్తామని చెప్పి ఇప్పటికీ పూర్తి చేయలేకపోయారని మండిపడ్డారు. గుజరాత్‌లో ఇంటింటికి నల్లా ప్రాజెక్టు 2004-05లోనే అతి తక్కువ ఖర్చుతో పూర్తయిందన్నారు. కేసీఆర్ గతంలో దుబ్బాక ఉపఎన్నికలో చెప్పిన డైలాగులే మళ్లీ హుజురాబాద్ ఉపఎన్నికలో చెప్పారని విమర్శించారు.

బీసీలకు,ఆదివాసీలకు రూ.10లక్షలు ఇవ్వాల్సిందే... ఎంపీ అరవింద్
రాష్ట్రంలో దళిత బంధు పథకం ఒక్క దళిత కుటుంబానికి అందకపోయినా ఊరుకునేది లేదని హెచ్చరించారు.అలాగే బీసీలు,బంజారాలు,ఆదివాసీలకు కూడా కుటుంబానికి రూ.10లక్షలు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా కారణంగా దళిత బంధు పథకం ఏడాది ఆలస్యమైందని చెప్పడంపై అరవింద్ విమర్శలు గుప్పించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు అడ్డురాని కరోనా దళిత బంధుకే అడ్డు వచ్చిందా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఇప్పుడు ప్రకటిస్తున్న పథకాలు,హుజురాబాద్‌లో అందిస్తున్న సంక్షేమ పథకాలు... ఈ క్రెడిట్ అంతా ఈటల రాజేందర్‌కే దక్కుతుందన్నారు. ఈటలకు భయపడే కేసీఆర్ ఇవన్నీ అమలుచేస్తున్నారని అన్నారు.

కేసీఆర్ మళ్లీ దొరకడు.. ఇప్పుడే అమలు చేయించుకోవాలి... : ఎంపీ అరవింద్
హుజురాబాద్ ప్రజలను మభ్యపెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని... ప్రజలు అన్నీ గమనించాలని కోరారు. హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ కచ్చితంగా భారీ మెజారిటీతో గెలుస్తారని అన్నారు. హుజురాబాద్‌లో కేసీఆర్ ఏయే హామీలైతే ఇచ్చారో... వాటన్నింటినీ ఇప్పుడే అమలుచేసేలా ప్రజలు ఒత్తిడి తేవాలన్నారు. లేదంటే... ఉపఎన్నిక అయిపోయాక ఆయన మళ్లీ దొరకడని అన్నారు. ఇళ్ల పట్టాల కోసం జర్నలిస్టులు,దళిత బంధు కోసం దళితులు,భూమి కోసం కుల సంఘాలు ఇప్పుడే కేసీఆర్‌పై ఒత్తిడి తెచ్చి సాధించుకోవాలన్నారు. లేదంటే గతంలో ఇచ్చిన ప్రొసీడింగ్స్ మాదిరే ఇవి కూడా పెండింగ్‌లో ఉండిపోతాయన్నారు. గతంలో రజక,నాయిబ్రాహ్మణ సోదరులకు ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పిన కేసీఆర్... ఇప్పటికీ దాన్ని అమలుచేయలేదన్నారు.జీహెచ్ఎంసీలో ఉచిత మంచినీరు అందిస్తామని చెప్పి ఇప్పటికీ ఇవ్వలేకపోయారని అన్నారు.

వరి దిగుబడి అందుకే పెరిగింది... : ఎంపీ అరవింద్
రాష్ట్రంలో వరి పంట దిగుబడి పెరగడానికి కారణం కేంద్రం వరికి కనీస మద్దతు ధరను ప్రకటించడమేనని అన్నారు. చెరుకు ఫ్యాక్టరీని ప్రభుత్వం క్లోజ్ చేయడంతో చెరుకు రైతులు కూడా వరినే సాగుచేశారని చెప్పారు. పసుపు పంటకు మద్దతు ధర ఇస్తామని స్వయంగా కేంద్రమంత్రి పార్లమెంటులో ప్రకటించారని... రాష్ట్ర ప్రభుత్వం దానిపై ఒక్క లేఖ కూడా కేంద్రానికి రాయలేదని అన్నారు. ఏడున్నరేళ్ల పాలనలో ఒక్క పంటకు బోనస్ ఇవ్వలేదన్నారు. ఆఖరికి పండించిన పంటను తరలించే ట్రాన్స్‌పోర్టులోనూ టీఆర్ఎస్ నేతలే చొరబడ్డారని ఆరోపించారు. గతేడాది వర్షాల కారణంగా ధాన్యం తడిసి నష్టపోయిన రైతులకు ఒక్క రూపాయి పరిహారం ఇవ్వలేదన్నారు.

రేవంత్ కేసీఆర్ రెండో కొడుకు...
హుజురాబాద్‌లో ఇతర పార్టీల నేతలను కొనేందుకు ఇప్పటివరకూ రూ.200 కోట్లు ఖర్చు చేశారని ఎంపీ అరవింద్ ఆరోపించారు. అయితే కాంగ్రెసోళ్లను మాత్రం టీఆర్ఎస్ కొనట్లేదని... 2023 వరకు రేవంత్ రెడ్డి కేసీఆర్‌కు రెండో కొడుకు అని విమర్శించారు. రేవంత్‌ను కేసీఆర్ దత్తత తీసుకున్నాకే ఆయనకు పీసీసీ చీఫ్ పదవి దక్కిందన్నారు. ఇప్పటివరకూ ప్రభుత్వం నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల అప్పు చేయగా...అందులో 30 శాతం కేసీఆర్ కుటుంబమే మింగిందన్నారు. 2023లో కేటీఆర్ విజయ్ మాల్యా తరహాలో దేశం విడిచి పారిపోతారని విమర్శించారు. కవిత,సంతోష్ రావు కూడా అలాగే పారిపోతారని విమర్శించారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెడుతానని చెప్పిన కేసీఆర్... ఇప్పటికీ దాన్ని నెరవేర్చలేదన్నారు. కనీసం అంబేడ్కర్ జయంతి,వర్ధంతులకు కూడా ఆయన ఏనాడు బయటకు రాలేదన్నారు. దళిత బంధు పథకం అమలుకు రూ.1లక్షా 75వేల కోట్లు ఖర్చవుతాయని... ఇది చిన్న మొత్తమేనని ఆయన చెబుతున్నారని అన్నారు. అది చిన్న మొత్తమే అయితే రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ యువకులకు నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎందుకు కట్టివ్వట్లేదని ప్రశ్నించారు.
Recommended Video

క్రెడిట్ అంతా ఈటల రాజేందర్‌కే....
గత మూడేళ్లుగా హుజురాబాద్‌లో పెండింగ్‌లో ఉన్న సంక్షేమ పథకాలన్నీ వెంటనే అమలుచేస్తున్నారని... కొత్తగా 3వేల మంది ఫించన్లు,11వేల మంది రేషన్ కార్డులు ఇస్తున్నారని...ఈ క్రెడిట్ అంతా ఈటల రాజేందర్‌కే దక్కుతుందని అన్నారు. యాదవ సోదరులకు 600 గొర్రెల యూనిట్లను పంపిణీ చేస్తామని ప్రకటించారని... యాదవ సోదరులు ఇక పశువుల కాపరుల్లాగే ఉండాలా అని ప్రశ్నించారు. ముందు నీ కొడుకు,బిడ్డకు 10 గొర్లు ఇవ్వాలని కేసీఆర్‌ను విమర్శించారు. గెలిచే చోటుకు కేటీఆర్‌ను,ఓడిపోయే చోటుకు హరీశ్ రావును కేసీఆర్ పంపిస్తారని... అందుకే హుజురాబాద్‌కు హరీశ్ రావును పంపించారని విమర్శించారు.












Click it and Unblock the Notifications