వారి పరిస్థితి కట్టుబానిసల కంటే దారుణం; గొడ్డుచాకిరీ చేయించుకుని అన్యాయం చేస్తారా: కేసీఆర్ కు రేవంత్
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడకముందే అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. టిఆర్ఎస్ బిజెపి, టిఆర్ఎస్ కాంగ్రెస్, కాంగ్రెస్ బిజెపి ఇలా పార్టీలన్నీ ఒకదానిపై ఒకటి విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా అధికార టీఆర్ఎస్ పార్టీ పై, టిఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుపై, సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు టిపిసిసి రేవంత్ రెడ్డి.
Recommended Video

తెలంగాణలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య లెటర్స్ వార్
ఇటీవల కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తున్న వేళ ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ లు రాష్ట్రంలోని సమస్యలపై ఫోకస్ చేస్తూ కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నాయి. ఇటీవల ప్రతిపక్ష పార్టీల నాయకులు కేసీఆర్ కు తెలంగాణా రాష్ట్రంలో అనేక సమస్యలపై లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక అధికార టీఆర్ఎస్ కూడా కేంద్రంలోని బీజేపీని టార్గెట్ చేస్తూ లేఖాస్త్రాలు సంధిస్తున్న పరిస్థితి ఉంది.

కట్టు బానిసల కంటే హీనంగా వీఆర్ఓల పరిస్థితి
కెసిఆర్ పాలన పై మండిపడుతున్న రేవంత్ రెడ్డి తాజాగా సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. కెసిఆర్ ప్రభుత్వ హయాంలో వీఆర్ఓల పరిస్థితి కట్టుబానిసల కంటే హీనంగా తయారైంది అంటూ రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. వీఆర్ఓలతో గొడ్డు చాకిరీ చేయించుకుని వాళ్ళ హక్కులను కాలరాస్తున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వీఆర్ఓల పరిస్థితి దుర్భరంగా మారిందని, ఏళ్ల తరబడి వారికి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు గాని లేవని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

హామీలు ఇవ్వటం తప్ప అమలు చేసే సోయి లేని కేసీఆర్
చాలీచాలని జీతాలతో వారు దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. హామీలు ఇవ్వడం తప్ప అమలు చేయడం మీద తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఏమాత్రం సోయి లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వీఆర్ఓ లకు పే స్కేల్ అమలుచేస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని పేర్కొన్న రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి ఇన్ని ఏళ్ళు గడుస్తున్నా అమలు చేయటం లేదంటూ మండిపడ్డారు. వీఆర్వోలకు తక్షణమే స్కేల్ అమలుచేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా ఉన్న వారికి అన్యాయం చెయ్యొద్దు
అర్హులైన విఆర్వో లకు పదోన్నతులు కూడా కల్పించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. శేషాద్రి కమిటీ ఓ కంటితుడుపు చర్యకు ఏర్పాటుచేసిన కమిటీ అని పేర్కొన్న రేవంత్ రెడ్డి రాష్ట్రంలో విధులు లేకుండా 5,756 మంది విఆర్వోలు ఖాళీగా ఉన్నారని, తెలంగాణ ప్రభుత్వం వీఆర్వోల వ్యవస్థను రద్దు చేసి 16 నెలలు గడుస్తోంది అని పేర్కొన్నారు. విధి నిర్వహణలో చనిపోయిన వీఆర్వోల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, వారికి సొంత గ్రామాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించి ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వారికి అన్యాయం చేయొద్దని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications